
‘తిరుగుబాటు’పై ఉక్కుపాదం
టర్కీ పోలీసుల అదుపులో 6 వేల మంది
- చట్ట ప్రకారం వ్యవహరించాలని ఒబామా సూచన
- ప్రభుత్వ యంత్రాంగాల్లో వైరస్‌ను తొలగిస్తామన్న ఎర్డోగన్
- జూలై 15 ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటన
ఇస్తాంబుల్/అంకారా: సైనిక కుట్రను విజయవంతంగా తిప్పికొట్టిన టర్కీ.. అందుకు సహకరించిన వారిపై కొరడా ఝులిపిస్తోంది. శనివారం మొదలైన అరెస్టులు ఆదివారం కూడా కొనసాగాయి. విచారణ నిమిత్తం 6 వేల మందిని అదుపులోకి తీసుకున్నామని టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజ్‌డేగ్ ప్రకటించారు. అరెస్టైన వారిలో ఆర్మీకి చెందిన ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు, వందల మంది సైనికులు ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పదుల సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు అరెస్టు వారెంట్లు జారీ చేశామని బెకిర్ చెప్పారు. ఇప్పటికే దాదాపు 3 వేల మంది న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని తొలగించారు.
అంకారాలో గులెన్ వర్గానికి న్యాయవాదుల్ని అరెస్టు చేశారు. తిరుగుబాటు అనంతర పరిస్థితుల్ని చట్ట ప్రకారం పరిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరగా, టర్కీ ప్రభుత్వ యంత్రాంగాల్లో వైరస్‌ను తొలగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. జూలై 15ను ప్రజాస్వామ్య దినోత్సవంగా నిర్వహిస్తామని టర్కీ ప్రధాని తెలిపారు. తిరుగుబాటు సందర్భంగా రేగిన హింసలో 161 మంది పౌరులు, ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. సైనిక కుట్రలో పాల్గొన్న 104 మంది మృతిచెందారని మిలట్రీ ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి అధ్యక్షుడు ఎర్డొగన్ మద్దతుదారులు దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు కొనసాగించారు.
పోలీసుల అదుపులో 34 మంది జనరల్స్
టర్కీ ప్రముఖ చానల్ కథనం ప్రకారం ఆర్మీలోని వివిధ హోదాల్లో ఉన్న 34 మంది జనరల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత్యున్నత హోదాలో ఉన్న ఆర్మీ కమాండర్లు ఎర్డల్ ఒజ్‌టర్క్, అడెమ్ హ్యుడుటి, ఒజాన్ ఓజ్‌బకీర్‌లను కూడా అరెస్టు చేశారు. ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ బెకిర్ ఎర్కన్ వ్యాన్ తో పాటు మరో 12 మంది కింది స్థాయి అధికారుల్ని ఇన్‌సర్లిక్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. మిలట్రీ హెలికాప్టర్‌లో గ్రీస్‌కు తప్పించుకుపోయిన ఎనిమిది మందిని తమకు అప్పగించాలని టర్కీ డిమాండ్ చేసింది.
మా పాత్ర లేదు: అమెరికా
టర్కీలో సైనిక కుట్రను ప్రపంచ నాయకులతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. తమపై టర్కీ ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాల్ని దెబ్బతీస్తాయని అమెరికా దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు. కాగా, సెనిక కుట్ర సందర్భంగా మరణించిన వారి అంత్యక్రియలు ఆదివారం అంకారా, ఇస్తాంబుల్ నిర్వహించారు. ఎర్డోగన్ స్వయంగా ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన స్నేహితుడు, అతని కుమారుడి మరణాల్ని తట్టుకోలేక అంత్యక్రియల్లో అధ్యక్షుడు కంటతడి పెట్టారు.