
కూలిన విమానంలో 7 ఏళ్ల చిన్నారి క్షేమం
న్యూయార్క్: అదృష్టమంటే ఈ ఏడేళ్ల చిన్నారిదే. ఘోర విమాన ప్రమాదం నుంచి మృత్యుంజయురాలిగా బయటపడింది. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శుక్రవారం ఈ అబ్బురపరిచే ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింది. పైలట్తో పాటు ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.
అయితే విమానంలో ఉన్న ఏడేళ్ల బాలిక ఈ ప్రమాదం నుంచి బయటపడింది. విమాన శకలాల నుంచి నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న ఓ ఇంటి దగ్గరకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ప్రాణాపాయ గాయలు కాలేదని తెలిపారు. ఈ ప్రమాద వివరాలను పోలీసులు ఫేస్బుక్లో పేర్కొన్నారు.