
అమెరికా విమానాన్ని కూల్చేసిన తాలిబన్లు
12 మంది దుర్మరణం.. వారిలో ఐదుగురు సైనికులు
అమెరికా రవాణా విమానం ఒకటి అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలి.. అందులో ఉన్న 12 మంది మరణించారు. సి-130 రకానికి చెందిన అమెరికన్ విమానం అర్ధరాత్రి సమయంలో కూలిపోయిందని, దాంతో అందులోని వాళ్లంతా మరణించారని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ఐదుగురు అమెరికా సైనికులు కూడా ఉన్నారు.
అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది, విమానం ఎందుకు కూలిందన్న విషయాలు మాత్రం తెలియరావడం లేదు. ఈ ఘటన గురించిన వివరాలేవీ అందడం లేదని టోనీ విక్మన్ అనే ప్రతినిధి చెప్పారు. అయితే.. విమానాన్ని కూల్చింది తామేనని తాలిబన్లు ప్రకటించుకున్నట్లు తాజా సమాచారం. గత సంవత్సరం జూన్ నెలలో సి-130 విమానం ఒకటి అఫ్ఘాన్ పశ్చిమప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. అయితే, అప్పట్లో ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు.