
శరీరంలో 75% చెత్త డీఎన్‌ఏ
హ్యూస్టన్: మానవ శరీరంలోని జన్యువుల్లో 75 శాతం పనికిరాని (జంక్) డీఎన్‌ఏ ఉంటుందని వెల్లడైంది. మనిషి శరీరంలో 10 నుంచి 15 శాతం జన్యువులు మాత్రమే పనికొచ్చేవి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఇలా శరీర క్రియలు నిర్వహించే జన్యువుల సంఖ్య శరీరంలో 25 శాతానికి మించి ఉండదని అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు వివరించారు.
మిగతా 75 శాతం డీఎన్‌ఏ ఏ క్రియలను నిర్వర్తించవని, వీటి వల్ల శరీరానికి ఏ ఉపయోగం గానీ.. హాని గానీ ఉండదని వారు స్పష్టం చేశారు. గత పరిశోధనల్లో మానవ శరీరంలో 80 శాతం జన్యువులు క్రియాశీలకమైనవని వెల్లడించగా.. తాజా అధ్యయన ఫలితాలు దానికి పూర్తి వ్యతిరేకంగా రావడం గమనార్హం. ఈ ఫలితాలు మన జన్యువులపై మరింతగా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతున్నాయని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు డాన్‌గ్రాయర్ తెలిపారు.