పంటి చికిత్స కోసం వెళ్లి గజినీ అయ్యాడు
లండన్: గజిని చిత్రం గుర్తుందిగా.. అందులో హీరోకి ఏ విషయమూ 15 నిమిషాలకంటే ఎక్కువ సేపు గుర్తుండదు. ఆ కాసేపట్లోనే అన్నీ మర్చిపోతుంటాడు. దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారనే విషయం అప్పుడే అందరికీ తెలిసింది. అయితే అది సినిమా... కానీ ఇప్పుడు లండన్‌లో నిజంగానే ఓ గజిని అవతరించాడు. బ్రిటన్‌కు చెందిన ఓ 38 ఏళ్ల వ్యక్తి అచ్చం గజిని సినిమాలోలాగే కొత్త విషయమేదీ ఎక్కువ సేపు గుర్తుంచుకోడు. ఇతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలే. ఆ తర్వాత అన్నీ కొత్తగానే ఉంటాయి. అయితే ఇతడు గజినిగా మారడానికి దోహదపడిన కారణం తెలిస్తే మాత్రం జాలేస్తుంది.
దాదాపు పదేళ్ల క్రితం ఇతడు పంటి నొప్పితో ఓ వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యుడు అతడ్ని పరీక్షించి రూట్ కెనాల్ చికిత్స చేయాలని నిర్ణయించి, మత్తుమందు ఇచ్చాడు. చికిత్స పూర్తి అయినప్పటి నుంచి అతడు గతాన్ని మర్చిపోయాడు. ఇక అప్పటినుంచి అతడి జ్ఞాపకశక్తి కేవలం 90 నిమిషాలుగానే మారిపోయింది. పదేళ్ల నుంచి అతడు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాడు. నిద్రలేవగానే ప్రతిరోజూ ఉదయం తనకు దంతవైద్యుడి దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. అప్పటివరకే అతడికి గుర్తుంది. అయితే తన పేరు, వివరాలు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయని అతడు తెలిపాడు.