ఇద్దరమ్మాయిలకు పెళ్లి.. ఒబామాకు ఆహ్వానం
అమెరికాలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెడ్డింగ్ కార్డులు సహా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. తమ పెళ్లికి రావాలంటూ ఏకంగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆహ్వానం పంపారు. వినడానికి వింతగా ఉన్నా.. ప్రపంచంలో సేమ్ సెక్స్ వివాహాలు చేసుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
చెల్సియా రోడెన్, లిసా హిర్ష్పెక్ అనే అమ్మాయిలు లవ్లో పడ్డారు. నాలుగేళ్లుగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంటకు ఒబామాకు ఆహ్వానం పంపాలని అనిపించింది. వెడ్డింగ్ కార్డును వైట్హౌజ్కు అయితే పంపారు కానీ ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వైట్హౌజ్ నుంచి లేఖ రావడంతో షాకయ్యారు. 'వివాహం చేసుకోబోతున్న మీకు అభినందనలు. ఈ ప్రత్యేక సమయంలో సంతోషంతో, ప్రేమతో గడపాలని కోరుకుంటున్నాం.
మీ జీవిత ప్రయాణంలో మీకు మంచి జరగాలని, ఇద్దరి బంధం మరింత దృఢపడాలని ఆకాంక్షిస్తున్నాం' అంటూ ఒబామా దంపతులు పంపిన లేఖలో అభినందనలు తెలిపారు. ఈ లేఖపై ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా సంతకాలు చేశారు. ఈ లేఖ చూడగానే సంబరం, ఆశ్చర్యానికి గురైంది రోడెన్. దీని ఫొటో తీసి, జర్మనీలో ఉన్న లిసా హిర్ష్పెక్కు పంపింది. రోడెన్ తమ ఇద్దరి ఫొటోలతో పాటు వెడ్డింగ్ కార్డు, ఒబామా దంపతులు పంపిన లేఖను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.