ఆయువు పోస్తారా.. తీస్తారా
11 నెలల పసిగుడ్డు. కాళ్లు చేతులు కదపలేడు. ఊపిరి కూడా సొంతంగా తీసుకోలేడు. తొమ్మిది నెలలుగా వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అరుదైన జన్యుపరమైన లోపం. మెదడు బాగా దెబ్బతింది. బతికే అవకాశాల్లేవు అంటున్నారు వైద్య నిపుణులు. వెంటిలేటర్ తొలగించి చిన్నారికి ‘విముక్తి’ ప్రసాదించడం ఉత్తమమని తేల్చారు. ససేమిరా అంటోంది కన్నప్రేమ. బిడ్డను బతికించుకునేందుకు ఆఖరి అవకాశం ఇవ్వాలని న్యాయ పోరాటానికి దిగారు తల్లిదండ్రులు. హైకోర్టు, సుప్రీంకోర్టు నిరాకరించాయి. అంతే.. ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. పసివాడి ప్రాణం నిలబడాలని కోరుకున్న లక్షలాది మంది విలవిల్లాడుతున్నారు. ప్రపంచం యావత్తు ఎవరీ చిన్నారని ఆరా తీస్తోంది.
అతని పేరు చార్లీ గార్డ్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
‘‘అనారోగ్యం కారణంగా ప్రాణహాని ఉన్నపుడు..
ఆ జీవికి ప్రేమతో అండగా నిలబడటం దేవుడు మనందరిపై పెట్టిన బాధ్యత’’ – పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్
‘‘బ్రిటన్‌లోని మా మిత్రులు, పోప్ కోరుకుంటున్నట్లుగా చిన్నారి చార్లీకి మా వల్ల అయ్యే ఏ సహాయమైనా చేయడానికి సిద్ధం’’ – ట్రంప్
పోప్ ఫ్రాన్సిస్ చిన్నారి చార్లీని రోమ్‌లోని ఆసుపత్రిలో చేర్చాలని.. ప్రశాంతంగా చివరి శ్వాస తీసుకోవడానికి ప్రార్థనలు చేద్దామని తల్లిదండ్రులను ఆహ్వానించారు. మరోవైపు వైట్‌హౌస్ ప్రతినిధులు చార్లీ తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన ఏ సహాయమైనా చేస్తామని చెప్పారు. ప్రపంచమంతా చిన్నారి చార్లీ కోసం పోరాడుతుంటే మనమేం చేస్తున్నట్లు అనే ప్రశ్నను బ్రిటిషర్లు లేవనె త్తుతున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. కానీ ‘భగవం తుడా చార్లీని బతికించు’అని ప్రపంచం ప్రార్థిస్తోంది.
అత్యంత అరుదు..
బ్రిటన్‌కు చెందిన క్రిస్ గార్డ్, కోనీ యేట్స్‌కు 2016 ఆగస్టు 4న జన్మించాడు చార్లీ. రెండు నెలల వయసు వచ్చే సరికి బరువు పెరగకపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో పరీక్షలు చేశారు. మిటో కాండ్రియల్ డీఎన్‌ఏ డిప్లెషన్ సిండ్రోమ్(ఎంఎండీఎస్) అనే అత్యంత అరుదైన జన్యులోపంతో బాధపడుతున్నట్లు తేలింది. దీని వల్ల శక్తి హీనత, మెదడు దెబ్బతినడం, కాలేయం విఫలం కావ డం, మూర్ఛపోవడం.. తదితర సమస్యలతో సతమత మవుతారు. ప్రపంచంలో ఇప్పటివరకు 16 మందిలో మాత్రమే దీనిని గుర్తించారు. చికిత్స నిమిత్తం లండన్‌లోని గ్రేట్ అర్మాండ్ స్ట్రీట్ ఆసుపత్రిలో చేర్చారు.
చార్లీకి వైద్య పరంగా చేయగలిగిందేమీ లేదని.. కాబట్టి వెంటిలేటర్ తొలగించ డానికి అనుమతివ్వాలని ఆసుపత్రి దరఖాస్తు చేసింది. దీన్ని క్రిస్, కోని లండన్ హైకోర్టులో సవాల్ చేశారు. అమెరికాలో ఇలాంటి వ్యాధికి చికిత్స ప్రయోగాల దశలో ఉందని.. అతన్ని అమెరికాకు తీసుకెళ్లి చికిత్స చేయించడానికి అనుమతివ్వాలని వేడుకున్నారు. ‘అతనికి ఒక్క అవకాశం ఇవ్వరూ..’అని ప్రాధేయపడ్డారు. ఏప్రిల్ 11న హైకోర్టు వీరి విజ్ఞప్తిని తిరస్కరిం చింది. లైఫ్ సపోర్టింగ్ మెషీన్‌ను ఆపు చేయాలని చెప్పింది. భారమైన హృదయంతో చార్లీని దృష్టిలో పెట్టుకొని తానీ నిర్ణయాన్ని వెలువరిస్తున్నాని జస్టిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. బ్రిటన్ సుప్రీంకోర్టు కూడా వెంటిలేటర్‌ను తొలగిం చాలనే అభిప్రాయపడింది.
మరోవైపు అమెరికాలో చార్లీ చికిత్స కోసం రూ.10.92 కోట్లు విరాళాల రూపంలో సమీకరించారు. ఆఖరి ప్రయత్నంగా యూరోప్ మానవ హక్కుల కోర్టును ఆశ్రయిం చగా.. జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. బిడ్డ ఊపిరి ఆపుతారనే నిజాన్ని జీర్ణించు కోలేక కన్నీరు మున్నీరయ్యారు క్రిస్, క్రోని. షెడ్యూల్ ప్రకారం జూన్ 30న వెంటి లేటర్‌ను తొలగించాలి. బిడ్డతో మరికొంత సమయం గడప డానికి, ప్రశాంతంగా వీడ్కోలు పలకడానికి సమయం కావాలన్న చార్లీ తల్లిదండ్రుల కోరిక మేరకు.. వెంటి లేటర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే చార్లీని ఇంటికి తీసుకెళ్లాలని, ఆఖరి సారిగా లాలపోసి.. జోల పాడాలని ఆ తల్లి కోరుకుంది. దీనికి వీల్లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఆమె తల్లడిల్లిపోతోంది.