అమెరికా వీసా.. మరింత కాస్ట్లీ గురూ!
అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్-1బి, ఎల్-1 వీసాలు మరింత భారం కానున్నాయి. 9/11 ఆరోగ్యసంరక్షణ చట్టం పేరుతో ఈ వీసాలపై ప్రత్యేకంగా 2 వేల డాలర్ల ఫీజు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1.35 లక్షలు) బాదాలని అక్కడివాళ్లు భావిస్తున్నారు. ఇంతకుముందు ప్రవేశపెట్టిన జేమ్స్ జడ్రోగా 9/11 హెల్త్ అండ్ కాంపన్సేషన్ చట్టంఓల భాగంగానే ఈ భారం మోపేందుకు అక్కడి ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2006లో శ్వాసకోశ సమస్యలతో మరణించిన డిటెక్టివ్ పేరుమీద ఈ చట్టం వచ్చింది. అయితే.. ఈ చట్టం కాలపరిమితి అక్టోబర్ 1వ తేదీతో ముగిసింది. ఈ బిల్లును ఇక కాలపరిమితి అంటూ లేకుండా శాశ్వతంగా పొడిగించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీంట్లో భాగంగా హెచ్-1బి వీసాల మీద అదనంగా 2వేల డాలర్ల ఫీజు మోపాలని అడుగుతున్నారు. అయితే, బిల్లులోని అంశాలను జాగ్రత్తగా చూస్తే, ఈ భారం కేవలం భారతీయ ఐటీ కంపెనీల మీదే పడేలా ఉంది.
భారతీయ ఐటీ కంపెనీలు 2010 నుంచి 2015 మధ్య ఏడాదికి సుమారు 470 -536 కోట్ల రూపాయలను వీసా ఫీజుగా చెల్లించినట్లు నాస్కామ్ చెబుతోంది. కంపెనీ ఉద్యోగులలో కనీసం సగం మంది హెచ్-1బి లేదా ఎల్-1 వీసాల మీద పనిచేస్తున్న కంపెనీలు ఈ ఫీజు చెల్లించాలని చట్టంలో ఉంది. దాదాపుగా ఇలాంటి పరిస్థితి కేవలం భారతీయ ఐటీ కంపెనీలకే ఉంఉటందని, అందువల్ల ఈ భారం మొత్తం మనవాళ్ల మీదే పడుతుందని అంటున్నారు.