భారీ బిల్‌బోర్డ్‌పై ఓ భార్య సందేశం
లండన్: పర స్త్రీ ప్రేమాయణంలో పడిపోయిన తన భర్తకు వినూత్న పద్ధతిలో బుద్ధి చెప్పాలనుకుంది లీసా. అందుకోసం ఎప్పుడూ రద్దీగా ఉంటే ‘షెఫీల్డ్ పార్క్ వే’లో 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు కలిగిన డిజిటల్ బిల్ బోర్డ్‌ను ఎంపిక చేసుకుంది. దానిపై తన సందేశాన్ని ఇలా డిస్‌ప్లే చేసింది. ‘నన్ను మోసం చేస్తున్న ఓ నా భర్త పాల్, మీరిద్దరు ఒకరికి ఒకరు తగినవారు. నీవు ఇంటికి తిరికొచ్చేసరికి నేనక్కడ ఉండను. నీవు ఆఫీసుకు సుఖంగా డ్రైవ్ చేస్తూ వెళ్లు!....ఇట్లు లీసా’. అన్న సందేశాన్ని భర్త పాల్ చూశారో, లేదోగానీ ఆ మార్గంలో వెళ్లిన వేలాది మంది ప్రయాణికులు ఆసక్తిగా చూశారు. ఎంతో మంది లీసాను ఉద్దేశించి ట్టిట్టర్‌లో ట్వీట్లు కూడా చేశారు.
ఈ సందేశం డిజిటల్ బిల్ బోర్డ్‌పై బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మళ్లీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు డిస్‌ప్లే అయింది. కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోని ఫెఫీల్డ్ నగరానికి వెళ్లే ప్రధాన రహదారి పార్క్ వే అవడంతో అది ఎప్పుడు రద్దీగా ఉంటుంది. రష్ అవర్లో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. తన భర్త పాల్ ఆఫీసుకు వెళ్లే సమయంలోనే ఈ సందేశాన్ని డిస్ ప్లే చేయాలని లీసా కోరినట్టు కాంగ్ మీడియా యాడ్ ఏజెన్నీ తెలిపింది. అందుకు లక్షలాది రూపాయలకు కూడా చెల్లించిందని చెప్పింది. అమెరికాలో ఇలాంటి ప్రకటనలు ఇస్తారని విన్నానుగానీ, బ్రిటన్‌లో మాత్రం ఇంతవరకు ఇలాంటి ప్రకటనలను తాము చూడలేదని, కనీసం వినలేదని కాంగ్ మీడియా పేర్కొంది. లీసా వివరాలను వెల్లడించేందుకు తిరస్కరించింది.
లీసా సందేశంపై స్పందించిన ట్విట్టర్ యూజర్లలో పలువురు ‘గుడ్ లక్ లీసా’ అంటూ ట్వీట్ చేశారు. మొైబె ల్ మెసేజ్‌ల కాలంలో ఇలా మెసేజ్ ఇవ్వడం చిత్రమేనని కొందరు వ్యాఖ్యానించారు. మరి కొంతమందేమో ఇది ఫేక్ సందేశం కావచ్చని సందేహం వ్యక్తం చేశారు. ఫేక్ కాదని, తాము అన్ని ధ్రువీకరించుకున్నాకే ప్రకటనకు అనుమతించామని బిల్‌బోర్డ్ యజమాని ‘ఆంకో డిజిటల్’ స్పష్టం చేసింది. లీసాది మంచి ఆలోచనని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక ముందు మ్యారేజ్ ప్రపోజల్స్‌ను కూడా ఇలా డిస్ ప్లే చేస్తామని కాంగ్ మీడియా యాడ్ ఏజెన్సీ ప్రకటించింది.