
రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ రాజీనామా
కాబూల్: అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రి అబ్దుల్లా హబీబీ, ఆర్మీ చీఫ్ కదమ్ షా షహీమ్ సోమవారం తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆమోదించినట్లు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తర అఫ్గాన్‌లోని మజర్ ఈ షరీఫ్ నగర సమీపంలో సైనిక స్థావరంపై శుక్రవారం తాలిబాన్లు దాడికి తెగబడి 100 మందికి పైగా సైనికులను పొట్టనబెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో కోపోద్రిక్తులైన అఫ్గాన్ ప్రజలు..రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, ఇతర అధికారుల రాజీనామాకు పట్టుబట్టారు. దీంతో వారు సోమవారం పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా చేశారు. అమెరికాలోని సిగార్ వాచ్‌డాగ్ సంస్థ నివేదిక ప్రకారం ఆఫ్గానిస్తాన్ సైనికుల మరణాలు 35శాతం పెరిగాయి. ఒక్క 2016లోనే సుమారు 6500 మంది సైనికులు, పోలీసులు వేరు వేరు ఘటనలు, దాడుల్లోమరణించారు.