ఫొటో కర్టెసీ: Social Media
కాబూల్: అఫ్గనిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ వలీ మహ్మద్ అహ్మద్‌జై దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రవేశం కొరకు మిగతా ప్రయాణికులతో కలిసి ఆయన వరుసలో నిల్చొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘మీరు కూడా పారిపోతే ఎలా? దేశంలోనే ఉంటూ పంజ్‌షీర్ వంటి రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు అండగా నిలవవచ్చు కదా!’’ అని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి వాళ్ల అసమర్థ నాయకత్వం వల్లే తాలిబన్లు.. దేశాన్ని ఆక్రమించుకోగలిగారు’’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక అఫ్గన్ తాలిబన్ల స్వాధీనం అయిన నేపథ్యంలో అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వలీ సైతం అదే బాటలో నడవడం గమనార్హం. కాగా తాలిబన్ల విజృంభణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ.. గత నెలలో వలీని సైన్యాధిపతిగా తొలగించి, ఆయన స్థానంలో హిబాతుల్లా అలీజైని నియమించారు.
అయితే, క్రమేణా ఆఫ్గన్ సైన్యంపై పైచేయి సాధించిన తాలిబన్లు ఆగష్టు 15న రాజధాని కాబూల్‌లో ప్రవేశించి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అశ్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయి ఆశ్రయం పొందుతుండగా.. పలువురు ఇతర నేతలు సైతం దేశం విడిచి వెళ్లిపోయారు. ఇక అఫ్గనిస్తాన్‌లో నివాసం ఉంటున్న విదేశీయులు సహా అఫ్గన్ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
చదవండి: Afghanistan Crisis: పాకిస్తాన్ వల్లే ఇదంతా.. ఇండియా మా ఫ్రెండ్..
Former Afghan Army Chief Wali Muhammad Ahmadzai is standing in line at Airport to leave the country. pic.twitter.com/SBaQ3QYmTZ
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2021
Comments
Please login to add a commentAdd a comment