కాబూల్ : ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరుగుతున్న చర్చల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరించేది లేదంటూ పరోక్షంగా అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హెచ్చరించారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో అష్రఫ్ ఘనీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఆదివారం నాడు ఈద్ ప్రార్థనల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు రానున్న కాలంలో దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉన్నందున వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికలు అత్యంత కీలకమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తును ఇక్కడ తామే నిర్ణయించుకుంటామని, ఇందులో ఎవరి జోక్యాన్ని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. దేశంలో శాంతియుత వాతావరణం నెలకొనాలన్నది ప్రతి ఆఫ్ఘన్ పౌరుడి ప్రగాఢ వాంఛ, ఇందులో ఎటువంటి సందేహానికీ తావులేదని పేర్కొన్నారు. ఆప్ఘన్‌లు ఆత్మగౌరవంతో సంచరించే విధంగా తాము శాంతిని కోరుకుంటున్నామని, కొంత మంది ప్రజలు దేశాన్ని వదిలిపెట్టాలన్న షరతుతో అమెరికా తరహా శాంతి ఒప్పందాన్ని కోరుకోవటం లేదన్నారు. తాము మేధో వలసలను, పెట్టుబడి వలసలను కోరుకోవటం లేదని, శాంతినే కోరుకుంటున్నామని పదే పదే వ్యాఖ్యానించారు.
తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం
సెప్టెంబర్ 1 నాటికి తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాము భావిస్తున్నట్లు అమెరికా రాయబారి జాల్మే ఖలీల్జాద్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఉగ్రవాద తండాలకు నెలవు కాబోదన్న హామీని తాలిబన్లు ఇస్తే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న 20 వేల మంది అమెరికా, నాటో దళాలను తాము ఉపసంహరించుకుంటామని ఆయన ప్రతిపాదించారు. ఇరువర్గాలూ ఈ ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తం చేయటంతో శాంతి ఒప్పందం కదురుతుందనే వార్తలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఆఫ్ఘన్ విషయంలో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఉంది. ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడానికి అమెరికా చాల రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే అతిపెద్ద అగ్రరాజ్యం ఒక చిన్న దేశంలోని తాలిబాన్లను కట్టడి చేయలేక పోయిందనే అపప్రదను మూటకట్టుకుందనే భయం అమెరికాలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment