బుల్లెట్లకు ఒక్క ఏడాదిలో 3,645మంది బలి
కాబుల్: తమ దేశ పౌరులు ప్రాణాలుకోల్పోతుండటంపట్ల అఫ్ఘనిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న భీకర యుద్ధం కారణంగా ఏనాడు ఆయుధాల ముఖాలు చూడని, అల్లర్లకు దిగని అమాయకులైన ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారని పేర్కొంది. 2015 సంవత్సరంలో తమ దేశ పౌరులకు జరిగిన నష్టం వివరాలను అఫ్ఘనిస్థాన్ అధ్యక్ష భవనం విడుదల చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలను ఐక్యరాజ్య సమితి సహాయక సంస్థ ప్రభుత్వానికి అందించగా దానిపట్ల ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నివేదిక ప్రకారం 2014తో పోల్చుకుంటే 2015లో ఎక్కువమంది పౌరులు ప్రాణాలుకోల్పోయారు. దాదాపు 11 వేలమంది ఈ దాడుల భారిన పడగా వారిలో 3,645 మంది పౌరులు మరణించగా, 7,457 మంది క్షతగాత్రులయ్యారు. 2014తో పోలిస్తే ఈ మరణ రేటు 4శాతం పెరిగింది. ఈ నివేదికపై అధ్యక్ష భవనం స్పందిస్తూ 'ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పౌరులు తమ జీవించే హక్కును కోల్పోతున్నారు. శాంతియుతంగా జీవించే మానవ హక్కులను పొందలేక పోతున్నారు. తాలిబన్లు మహిళలను, బాలికలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వారి జీవించే హక్కును కాలరాస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.