
ఫ్రాంక్‌ఫర్ట్ : ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాల పెంపు డిమాండ్‌తో చేపట్టిన ఒక్కరోజు సమ్మె.. ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగించింది. మంగళవారం సమ్మె జరగగా.. రవాణా వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపింది. ఈ క్రమంలో జర్మనీలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది, కిందిస్థాయి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్ధ లుఫ్తాన్సా 800 సర్వీసులను రద్దు చేసింది.
అలాగే ఎయిర్ ఫ్రాన్స్ కూడా నాలుగోవంతు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభావం యూరప్‌లోని ఇతర విమాన సర్వీసులపై కనిపిస్తోంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు మ్యూనిచ్, కొలోన్, బ్రెమెన్ విమానాశ్రయాల్లో సుమారు 90 వేల మంది ప్రయాణికులు పడిగాపులు పడ్డట్లు అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం విమాన సర్వీసులన్నింటినీ పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జర్మనీలోని వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే 23లక్షల మంది ఉద్యోగలు.. తమ వేతనాలను 6 శాతం పెంచాలంటూ ఈ సమ్మెను చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment