మరో మలేసియా విమానం అదృశ్యం | AirAsia Flight QZ8501 Goes Missing After Call for Course Shift | Sakshi
Sakshi News home page

మరో మలేసియా విమానం అదృశ్యం

Published Mon, Dec 29 2014 1:38 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

మరో మలేసియా విమానం అదృశ్యం - Sakshi

మరో మలేసియా విమానం అదృశ్యం

ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తుండగా మాయమైన ఎయిర్ ఆసియా విమానం
 
ప్రతికూల వాతావరణమే కారణం!
విమానంలో సిబ్బంది సహా 162 మంది ప్రయాణికులు
కొనసాగుతున్న గాలింపు చర్యలు


మరో మలేసియా విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం సింగపూర్‌కు బయల్దేరిన ఎయిర్‌ఆసియా విమానానికి అరగంట తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. అంతకు కొద్దిక్షణాల ముందే, ప్రతికూల వాతావరణముందని, విమాన ప్రయాణ మార్గపు ఎత్తును 32 వేల అడుగుల నుంచి 38 వేల అడుగులకు పెంచుకునేందుకు అనుమతించాలని పైలట్ ఏటీసీని అభ్యర్థించారు.

అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉండగా.. వారిలో 149 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియావారే. సమాచారం అందగానే పెద్ద ఎత్తున గాలింపు చర్యలను ఇండోనేసియా ప్రభుత్వం ప్రారంభించింది. భారీ వర్షం, దట్టమైన మేఘాలు గాలింపు చర్యలను ఆటంకపర్చాయి. చీకటిపడటంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించాలని నిర్ణయించారు.

గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొనేందుకు మూడు నౌకలను, ఒక విమానాన్ని భారత్ సిద్ధంగా ఉంచింది. సుమత్రా సముద్ర తీరంలో తూర్పు బెలితుంగ్ జలాల్లో ఆ విమానం కూలిపోయిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండిం చారు. ఈ సంవత్సరం ప్రమాదం బారిన పడిన మలేసియా విమానాల్లో ఇది మూడోది.

జకర్తా/సింగపూర్: ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన మలేసియాకు చెందిన ఎయిర్‌ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్‌బస్(ఏ320-200)..అరగంట తరువాత ఇండోనేసియా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7.24 గంటలకు(భారత కాలమానం ప్రకారం తెల్లవారుజాము 4.54) ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) పరిధి నుంచి దూరమైంది.

అంతకుముందు, ప్రతికూల వాతావరణముందని, విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకునేందుకు (32 వేల అడుగుల నుంచి 38 వేల ఎత్తుకు వెళ్లేందుకు) అనుమతించమని పైలట్ల నుంచి అభ్యర్థన వచ్చిందని ఏటీసీ అధికారులు తెలిపారు. ఆ తరువాత కాసేపటికే రాడార్ సంకేతాలు ఆగిపోయాయన్నారు. విమానం అదృశ్యమయ్యే సమయానికి అది ఇండోనేసియా ఏటీసీ నియంత్రణలోనే ఉంది. అదృశ్యమైన విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 162 మంది ఉన్నారు. వారిలో భారతీయులెవరూ లేరు.

ప్రయాణికుల్లో ఇండోనేసియాకు చెందిన వారు 149 మంది ఉండగా, ముగ్గురు దక్షిణ కొరియావారు, బ్రిటన్, మలేసియా, సింగపూర్‌లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. విమానంలో 16 మంది పిల్లలు, ఒక చిన్నారి ఉన్నారు. సిబ్బందిలోనూ ఆరుగురు ఇండోనేసియా వారే ఉన్నారు. మరో కోపైలట్ ఫ్రాన్స్ దేశస్తుడు. విమాన ఆచూకీ కోసం ఇండోనేసియా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు సైనిక విమానాలు, మరో హెలికాప్టర్ గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. జావా సముద్రాన్ని, అందులోని ద్వీపాలను నిశితంగా గాలించాయి. విమాన గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొనేందుకు మూడు నౌకలను, ఒక తీరగస్తీ విమానాన్ని భారత్ సిద్ధంగా ఉంచింది.

మలేసియాకు చెందిన మూడు విమానాలు, మూడు నౌకలు సోమవారం ఉదయం నుంచి గాలింపు, సహాయ చర్యల్లో పాల్గొననున్నాయి. సింగపూర్, ఆస్ట్రేలియాలు కూడా గాలింపులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. గాలింపు చర్యల్లో స్థానిక మత్స్యకారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. అయితే, దట్టంగా మేఘాలు ఆవరించి ఉండటం, భారీగా వర్షం పడుతుండటంతో పాటు చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపేశామని, తిరిగి సోమవారం తెల్లవారు జామున ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కొన్ని నౌకలు రాత్రి కూడా గాలింపు జరుపుతాయన్నారు.

కూలిపోయిందా!?
కాగా, సుమత్ర సముద్ర తీరంలో తూర్పు బెలితుంగ్ జలాల్లో ఆ విమానం కూలిపోయిందని, కొని శకలాలను గుర్తించారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటిని మలేసియా రవాణా మంత్రి ల్యూ తియాంగ్ లాయి ఖండించారు. ఆ వార్తలు నిరాధారమని, విమాన గాలింపు కొనసాగుతోందని స్పష్టం చేశారు. విమానం అదృశ్యమైన ప్రాంతంలో 50 వేల అడుగుల ఎత్తు వరకు దట్టమైన మేఘాలున్నాయని, ఉరుములు, మెరుపులతో వాతావరణం బీభత్సంగా ఉందని ఇండోనేసియా విమానయాన డెరైక్టర్ జోకో ముర్జత్మోజొ వెల్లడించారు.

బెలితుంగ్ ద్వీపంలోని తాంజుంగ్ పాండన్, ఇండోనేసియాలోని కాళీమంతన్‌ల మధ్య గగనతలంలో విమానమున్నప్పుడు చివరిసారిగా దాని నుంచి సంకేతాలొచ్చాయన్నారు. విమానం అదృశ్యమై చాలా గంటలు గడవడంతో ప్రయాణికులంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎయిర్‌ఆసియా తక్కువ ధరలకే విమాన సేవలందిస్తూ ‘బడ్జెట్ క్యారియర్’గా పేరుగాంచింది. ఆ గ్రూప్ సీఈఓగా భారత సంతతికి చెందిన టోనీ ఫెర్నాండెజ్ వ్యవహరిస్తున్నారు. ఇరుగుపొరుగు దేశాలకు విమాన సేవలందించేందుకు ఆయన పలు బడ్జెట్ విమానాలను ప్రారంభించారు. విమాన పైలట్‌గా ఉన్న కెప్టెన్ ఇరియాంతొకు 6,100 గంటల పైలటింగ్ అనుభవం ఉంది.
 
మలేసియా విమానాలకు గ్రహణం!
మలేసియా విమానాలను దురదృష్టం వెంటాడుతోంది. మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘ఎంహెచ్370’ విమానం గల్లంతైన కొన్ని నెలలకే ఆదివారం మరో మలేసియా విమానం ఆచూకీ లేకుండా పోయింది. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు కూడా మలేసియా విమానాన్నే నేలకూల్చారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడు ఘోర విమాన ప్రమాదాలను మలేసియా చవి చూసినట్లైంది. ఈ ఏడాది మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతుండగా సింగపూర్‌కు కొన్ని వందల మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఎంహెచ్370 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది.

ఇప్పటిదాకా ఆ విమానం, అందులోని 239 మంది ప్రయాణికుల ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. ఆ తర్వాత జూలై 17న ఆమ్‌స్టర్‌డాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్ విమానం ‘ఎంహెచ్ 17’ను ఉక్రెయిన్ గగనతలంలో తిరుగుబాటుదారులు కూల్చివేశారు. ఈ ఘటనలో 300 మంది మృతిచెందారు. తాజాగా అదృశ్యమైన ‘ఎయిర్‌ఏసియా’ విమానంలోనూ 162 మంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి గతం పునరావృతం కాకూడదని ప్రతిఒక్కరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement