మందు బాబులకో మంచి న్యూస్!
లండన్: మితమెప్పుడూ హితమే. అదే సంగతి మందుబాబుల విషయంలోనూ తేలింది. అరుదుగా లేదా ఎప్పుడూ మద్యం ముట్టనివారితో పోల్చుకుంటే.. మితంగా వైన్, లిక్కర్, బీరు వంటివాటిని సేవించేవారికి గుండె ముప్పు తక్కువేనట. గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి ఇలాంటి వాళ్లకు తక్కువగా ఎదురయ్యే అవకాశముందని తాజా పరిశోధనల్లో తేలింది. వారానికి మూడు నుంచి ఐదుసార్లు మితంగా మద్యం సేవించడం గుండెకు మంచిదని తాజాగా నిర్వహించిన రెండు పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.
'నిజానికి మద్యం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు దోహదం చేస్తుంది. అయితే మద్యం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మితంగా మద్యం సేవించడం ఉత్తమమైన మార్గం' అని నార్వేయిన్ యూనివ ర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సోషల్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇమ్రే జాన్‌స్కీ తెలిపారు. హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ పరిశోధనాంశం ప్రచురితం కాగా, గుండెపోటుకు సంబంధించిన అధ్యయన వివరాలను జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ వెల్లడించింది. ఈ రెండు పరిశోధనల్లోనూ తరచూ మితంగా మద్యం సేవించేవారిలో గుండె, రక్తనాళాల ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశముందని, అరుదుగా లేదా ఎప్పుడూ సేవించనివారితో పోలిస్తే.. వారానికి మూడు నుంచి ఐదుసార్లు మద్యం సేవించేవారిలో గుండె వైఫల్యం సమస్య 33శాతం తక్కువగా ఉండే అవకాశముందని ఈ రెండు అధ్యయనాల్లో తేలింది.