
ఆ సమయంలో డ్రింక్ చేశారంటే..
ఒత్తిడికి గురైన సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: మనసు బాగాలేదనో.. ప్రేమ విఫలమైందనో.. కుటుంబ, వృత్తిపరమైన సమస్యల వల్లో.. చాలా మంది మద్యం తాగుతుంటారు. బాధలను మరచి రిలాక్స్ కావాలనే ఉద్దేశ్యంతో డ్రింక్ అలవాటు చేసుకుంటారు. ఒత్తిడికి గురైన సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని, రానురాను ఇది అలవాటుగా మారి, మద్యానికి బానిసలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడికి గురైనపుడు మెదడులో మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మద్యం సేవించడం హానికరమని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని పెన్సల్వేనియా యూనివర్శిటీ పరిశోధకుడు జాన్ డానీ.. ఒత్తిడితో బాధపడుతున్న వారి అలవాట్లపై అధ్యయనం చేశారు.
ఇలాంటి లక్షణాలు కల వారు మద్యం తాగితే.. ఇతరుల మాదిరిగా వారికి అంతగా మత్తు ఎక్కదని, దీంతో ఆల్కాహాల్ మోతాదును క్రమేణా పెంచుతారని జాన్ డానీ చెప్పారు. ఇది నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. పోస్ట్-ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) ఉన్నవారు ఆల్కాహాల్, డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారని చెప్పారు. ఈ అలవాటు.. మెదడు, నాడీ వ్యవస్థకు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఒత్తిడికి గురైనట్టు భావిస్తున్నవారు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల మళ్లీ సాధారణ స్థితికి రావచ్చని తెలిపారు.