
ఆ పని.. ఈ పని అని లేదు.. అన్నింటా మేమే అన్నట్లు తయారయ్యాయి ఈ రోబోలు.. కొత్త కొత్త రంగాల్లోకి దూసుకుపోతున్నాయి.. రోబో 2.0 రీలోడెడ్ టైపన్నమాట. ఇంతకీ విషయమేమిటంటే.. అమెజాన్ ప్రైమ్.. దీని గురించి తెలియని వారుండరు. తెలియని విషయమేమిటంటే.. ఇప్పుడా అమెజాన్ ప్రైమ్ డెలివరీలు మనుషులు కాకుండా రోబోలు చేయనున్నాయి. ఇందుకోసం అమెజాన్ తన పరిశోధన కేంద్రంలో ప్రత్యేకమైన సెల్ఫ్ డ్రైవింగ్ డెలివరీ రోబోలను తయారుచేసింది. అంతేకాదు.. త్వరలో 6 స్కౌట్ రోబోలు వాషింగ్టన్‌లోని స్నహామిష్ కౌంటీలో డెలివరీలు కూడా ప్రారంభిస్తాయని ప్రకటించింది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ రోబోలు తమంతట తామే అడ్రస్‌కు వెళ్లి.. సరుకులు ఇచ్చి వస్తాయి. ఎవరినీ గుద్దేసే ప్రసక్తే లేదు.. ఎదురుగా ఎవరైనా వస్తే.. సైడిచ్చి మరీ ముందుకెళ్తాయి. అయితే, సదరు వినియోగదారులు అసలైనవారో కాదో అన్న విష యం ఇదె లా నిర్ధరించుకుంటుందన్న వివరాలను మాత్రం అమెజాన్ తెలియజేయలేదు. గతంలో వచ్చిన ఫుడ్ డెలివరీ రోబోలో అయితే వినియోగదారులు తమ మొబైల్‌కు వచ్చే.. ఓ ప్రత్యేకమైన కోడ్‌ను రోబో స్క్రీన్ మీ ద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తొలి దశలో తమ సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని.. తదనంతర దశలో ఇవి తమంతట తాము వెళ్లి డెలివరీ చేస్తాయ ని అమెజాన్ తెలిపింది. రోబోలే కాదు.. డెలివరీ డ్రోన్‌లను కూడా తాము తయారుచేస్తున్నామని.. తదనంతర దశలో ఉపయోగిస్తామని పేర్కొంది.
ఎయిర్‌పోర్టులో పార్కింగ్ అంటే పెద్ద పరేషానీనే.. అయితే, ఆ పనిని కూడా సునాయాసంగా చేయడానికి రోబోలు వచ్చేశాయి. చూశారుగా.. దీని పేరు స్టాన్. ఈ ఆగస్టులో బ్రిటన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్టులో ఈ రోబో వ్యాలెట్‌లు రంగంలోకి దిగనున్నాయి. వీటిని ఫ్రాన్స్‌కు చెందిన స్టాన్లీ రోబోటిక్స్ కంపెనీ తయారుచేసింది. ఆగస్టు నుంచి 3 నెలలపాటు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూడనున్నారు. ఇంతకీ ఇదేం చేస్తుందో తెలుసా? మీరు మీ కారును డ్రాపింగ్ జోన్‌లో వదిలేస్తే.. ఇది దాన్ని తీసుకెళ్లి.. జాగ్రత్తగా పార్క్ చేసి పెడుతుంది. కారు వద్దకు వెళ్లేందుకు.. ఆ కారును పార్కింగ్ ప్లేస్ వద్దకు తీసుకెళ్లేందుకు స్టాన్.. సైన్యంలో వాడే అత్యున్నత స్థాయి జీపీఎస్ టెక్నాలజీని వినియోగించుకుంటుంది. కారు షేప్, సైజును ఇవి స్కాన్ చేసుకుని.. దానికి తగ్గట్లుగా జాగా చూసుకుని పార్క్ చేస్తాయి. దీని వల్ల ప్రయాణికులకు సౌలభ్యం మాట పక్కనపెడితే.. మామూలుగా మనం.. 170 కార్లు పార్క్ చేసే స్థలంలో.. ఇవి 270 కార్లను పట్టించేస్తాయట. అదీ ఒకదానికి ఒకటి తగలకుండానే.. మళ్లా అవసరం పడితే.. వాటిని అక్కడి నుంచి తెచ్చి.. మనకు అందుబాటులో ఉంచుతాయి. బాగుంది కదూ..
Comments
Please login to add a commentAdd a comment