2020 అమెరికా స్వాతంత్ర్య వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్‌సన్, జేమ్స్ మాడిసన్, జేమ్స్ మన్నో, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్‌సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్, విలియం హెన్రీ హారిసన్, జాన్ టైలర్ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్ వాషింగ్టన్ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు.
ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అంతర్జాతీయ సంస్థలన్నింటినీ శాసించగల ఆర్థిక శక్తి... ఏ దేశాన్నైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోగల సైనిక బలగం కలిగిన శక్తిమంతమైన దేశం.. ఇలా దశాబ్దాల తరబడి అన్నింటా అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది అమెరికా. అయితే ఇప్పుడంటే ఈ దేశానికి ఇన్ని హోదాలు ఉన్నాయి గానీ.. ఒకప్పుడు అమెరికా కూడా బానిసగానే బతికింది. ప్రపంచాన్ని శాసించాలన్న బ్రిటన్ సామ్రాజ్యవాద కాంక్షకు బలైపోయింది. పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడి 1776, జూలై 4న స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ఆనాటి నుంచి జూలై 4ను ‘బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్’ డే గా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు..
244 ఏళ్ల క్రితం..
దాదాపు 244 క్రితం.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పోకడలను వ్యతిరేకిస్తూ 13 కాలనీల్లోని అమెరికన్లంతా ఒక్కటయ్యారు. శిస్తులు విపరీతంగా పెంచడం, కాలనిస్టుల అభిప్రాయం కోరకుండానే కాలనీల్లో సైన్యాన్ని మోహరించడం, ప్రజలపై కాల్పులకు తెగబడటం సహా కాలనిస్టులకు పార్లమెంటులో సముచిత స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో 1760-1770 మధ్య అమెరికన్ కాలనీలు, బ్రిటిష్ పాలకుల మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ విప్లవానికి తెరతీసింది. ఈ క్రమంలో 1775 ఏప్రిల్‌లో గ్రేట్ బ్రిటన్ నుంచి పూర్తిగా విముక్తి పొందితేనే బానిసత్వం తొలగిపోతుందటూ కాలనిస్టులు ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిల్చారు.
ఇందులో భాగంగా 1776లో రాజకీయవేత్త థామస్ పేన్ ‘కామన్ సెన్స్’ పేరిట ప్రచురించిన కరపత్రాలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ నేపథ్యంలో కాంటినెంటల్ కాంగ్రెస్ (బ్రిటిష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు) అదే ఏడాది జూన్ 7న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌజ్(ఈ తర్వాత ఇండిపెండెన్స్ హాల్‌గా గుర్తింపు పొందింది)లో నిర్వహించిన సమావేశంలో.. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ కాలనీల స్వాతంత్ర్యం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు.
వాడి వేడి చర్చల అనంతరం లీ తీర్మానంపై ఓటింగ్ వాయిదా వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. థామస్ జెఫర్‌సన్(వర్జీనియా), జాన్ ఆడమ్స్(మసాచుసెట్స్), రోజర్ షెర్మన్(కనెక్టికట్), బెంజమిన్ ఫ్రాంక్లిన్(పెన్సిల్వేనియా), రాబర్ట్ ఆర్ లివింగ్‌స్టన్(న్యూయార్క్) తదితర ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. గ్రేట్ బ్రిటన్ పెత్తనాన్ని కాలనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుపుతూ, స్వరాజ్య కాంక్షను సమర్థిస్తూ అధికారిక ప్రకటన చేసేందుకు వీలుగా ముసాయిదా రూపొందించాలని పేర్కొంది.
డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్..
అనేక పరిణామాల అనంతరం జూలై 2న లీ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటీష్ సింహాసనాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్ల స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం అంటే జూలై 4న డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ క్రియేటెడ్(మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు- అందరికీ సమాన హక్కులు అనే ఉద్దేశంతో)’ అంటూ థామస్ జెఫర్‌సన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అదే విధంగా.. ‘‘ఇప్పటి నుంచి మన ముందు తరాలు ఓ గొప్ప పండుగను ప్రతి ఏటా జరుపుకొంటాయి. సంబరాలు చేసుకుంటాయి. పరేడ్‌లు, ఆటలు, గంటల మోత, టపాసుల కాంతులు ఖండమంతటా విస్తరిస్తాయి’’అంటూ మసాచుసెట్స్ ప్రతినిధి జాన్ ఆడమ్స్ తన భార్యకు రాసిన లేఖలో స్వాతంత్ర్యం ఖరారైందనే శుభవార్త పంచుకున్నారు.
ఇలా ఓ వైపు బ్రిటీష్ బలగాలతో కాంటినెంటల్ ఆర్మీ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు స్వాతంత్ర్య ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో 1778లో ఫ్రాన్స్ అమెరికా కాలనీల తరఫున రంగంలోకి దిగడంతో.. ఎట్టకేలకు 1781లో వర్జీనియాలోని యార్క్‌టౌన్‌లో కొన్ని బ్రిటీష్ సేనలు లొంగిపోయాయి. అయితే 1783 ముగిసేనాటికి కూడా ఈ యుద్ధం ముగిసిపోలేదు. మరలా అనేక యుద్ధాలు, పరిణామాల అనంతరం 1941లో జూలై 4ను అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ హాలిడేగా ప్రకటించింది.
13 కాలనీలు
1. ప్రావిన్స్ ఆఫ్ మసాచుసెట్స్ బే
2. ప్రావిన్స్ ఆఫ్ హాంప్‌షైర్
3. కనెక్టికట్ కాలనీ
4.కాలనీ ఆఫ్ రోడే ఐలాండ్
5.డెలావేర్ కాలనీ
6.ప్రావిన్స్ ఆఫ్ న్యూయార్క్
7.ప్రావిన్స్ ఆఫ్ న్యూజెర్సీ
8. ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా
9. కాలనీ అండ్ డొమీనియన్ ఆఫ్ వర్జీనియా
10. ప్రావిన్స్ ఆఫ్ మేరీలాండ్
11. ప్రావిన్స్ ఆఫ్ నార్త్ కరోలినా
12. ప్రావిన్స్ ఆఫ్ సౌత్ కరోలినా
13. ప్రావిన్స్ ఆఫ్ జార్జియా
- జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామప్ జెఫర్‌సన్, జేమ్స్ మాడిసన్, జేమ్స్ మన్నో, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్‌సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్, విలియం హెన్రీ హారిసన్, జాన్ టైలర్ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్ వాషింగ్టన్ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment