వీసా గడువు దాటినా వెళ్లడంలేదట
వాషింగ్టన్: చిన్న చిన్న కారణాలకే భారతీయ విద్యార్థులను అమెరికా తిప్పి పంపేస్తుంటే.. సందర్శకులుగా, వ్యాపార పనుల నిమిత్తం వెళ్లిన భారతీయులు మాత్రం గడువు దాటినా అక్కడే ఉంటున్నారట. ఇలా ఉంటున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది 8.8 లక్షల మంది భారతీయులు బి1, బి2 వీసాలు తీసుకొని అమెరికాకు వెళ్లినా అందులో 14,000 మంది గడువు దాటినా ఆ దేశాన్ని వీడలేదట.
2014లో 7.6 లక్షల మంది తిరిగొచ్చే అనుమతితో అమెరికాకు వెళ్లగా అందులో 11,653 మంది గడువు దాటినా తిరిగి రాలేదట. ఈ వివరాలను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా వెల్లడించింది. మొత్తంగా చూస్తే అమెరికాకు వచ్చిన ప్రతి వందమంది విదేశీయుల్లో ఒకరు గడువులోగా దేశాన్ని వీడడం లేదని, 98.83 శాతం మంది మాత్రం నిర్ణీత గడువులోనే వెళ్లిపోతున్నారని అధికారులు తెలిపారు.