న్యూయార్క్ : పాకిస్థాన్ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లుంది. అందుకే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు మొన్నీమధ్యే ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇంతకాలం వెర్రోళ్లని చేసింది చాలూ... అంటూ స్వయంగా ట్వీట్ చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇక ఇప్పుడు వెనువెంటే అమెరికా.. పాక్‌కి మరో దెబ్బ వేసింది. భద్రతా సహకారాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మరో ప్రకటన చేసింది. ఈ మేరకు గురువారం అమెరికా భద్రతా దళ అధికార ప్రతినిధి హెథర్ నౌఎర్ట్ మీడియా ఎదుట ప్రకటన చేశారు. ‘‘ఇకపై పాకిస్థాన్‌కు ఆయుధాల సరఫరా, భద్రతకు సంబంధించి ఇతరత్రా సహకారాన్ని నిలిపివేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో గత కొన్నేళ్లుగా పాక్ పూర్తిగా విఫలమవుతూ వస్తోంది. పైగా అమెరికా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేవారికి పాక్ సాయం అందించటం ఖండించదగ్గ అంశం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం ’’ అని ఆమె ప్రకటించారు.
ఈ ప్రకటనపై మరో భద్రతాధికారి వివరణ ఇచ్చారు. 2016కుగానూ పాక్‌కు మంజూరు చేసిన మిలిటరీ ఫండ్‌ను నిలుపుదల చేస్తూ ఇది వరకే ఆదేశాలు జారీకాగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై పాక్‌కు ఎలాంటి ఆర్థిక, భద్రతా సహకారాలు అందబోవని ఆయన స్పష్టంచేశారు. అయితే ఈ విషయాన్ని కూడా పాకిస్థాన్ చాలా తేలికగానే తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొనటం విశేషం.
ట్రంప్ ట్వీట్ తర్వాత స్పందించిన పాక్ అర్థరహితమైన వ్యాఖ్యలతో తమ దేశ గౌరవానికి భంగం కలిగించారంటూ బదులివ్వటం తెలిసిందే. ఉగ్రవాదంపై పోరులో పాక్ చేసిన త్యాగాలను డబ్బుతో వెలకట్టడం సాధ్యం కాదని.. అమెరికా సహాయ సహకారాలు లేకపోయినా తమ పోరాటం కొనసాగుతుందని స్వయంగా ఆ దేశ ప్రధాని షాహిద్ ఖాన్ ప్రకటించటం చూశాం.
Comments
Please login to add a commentAdd a comment