అమెరికాకు యుద్ధ విమానాల పైలెట్ల కొరత
వాషింగ్టన్: అమెరికా వైమానిక దళం యుద్ధ విమానాల పైలెట్ల కొరతను ఎదుర్కొంటోంది. సిరియా, ఇరాక్, లిబియా దేశాల్లో ఐసిస్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా అమెరికా వైమానిక దాడులను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇది ప్రతికూల పరిణామం. ఈ ఏడాది చివరి నాటికి 700 మంది యుద్ధ విమానాల పైలెట్ల కొరత ఏర్పడుతుందని అమెరికా వైమానిక దళం ఉన్నతాధికారి జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫైన్ తాజాగా మీడియా ముందు వెల్లడించారు. 2022 నాటికి పైలెట్ల కొరత వెయ్యి దాటుతుందని కూడా చెప్పారు.
వాస్తవానికి మూడు నెలల క్రితమే అమెరికా వైమానిక స్థావరాలను సందర్శించిన ఫాక్స్ న్యూస్ ప్రతినిధులు పైలెట్ల కొరత గురించి వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా అంగీకరించడం మాత్రం ఇదో తొలిసారి. నాలుగువేల మంది మెకానిక్‌ల కొరత కూడా ఉందని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. యుద్ధ విమానాల విడిభాగాల ఉత్పత్తి కూడా అమెరికా ప్రస్తుతం కొనసాగించడం లేదు. దీని వల్ల యుద్ధ విమానాల మరమ్మతు కోసం అవసరమైన విడిభాగాల కోసం వైమానిక మ్యూజియంలు, విమానాల గ్రేవ్‌యార్డ్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
పైలెట్ల కొరత ఏర్పడడంతో అమెరికా యుద్ధ రంగంలో కూడా డ్రోన్‌ల వినియోగాన్ని పెంచింది. డ్రోన్‌లను ఆపరేట్ చేసే పైలెట్లను సర్వీసులో ఉంచేందుకు అధిక బోనస్‌లు కూడా చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని వైమానిక దళాల మంత్రి డెబోరా లీ జేమ్స్ స్వయంగా తెలిపారు. వారిపై ఏడాదికి 35 వేల డాలర్లను ఖర్చు పెడుతున్నామని చెప్పారు. వైమానిక రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగించడం తమ ఉద్దేశం కాదని, అదేమి అమెరికా జన్మహక్కు కాదని, కాకపోతే ప్రస్తుతమున్న వైమానిక శక్తి కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని జనరల్ డేవిడ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఐసిస్ టెర్రరిస్టులను తుదముట్టించేందుకు సిరియా, ఇరాక్, లిబియా దేశాల్లో అమెరికా కొనసాగిస్తున్న వైమానిక దాడులపై మాత్రం పైలెట్ల కొరత ప్రభావం ఏమీ లేదని ఆయన చెప్పారు.