27,000 దిగువకు సెన్సెక్స్
అంచనాల కంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. వెరసి వరుసగా మూడో రోజు సెన్సెక్స్ నష్టపోయింది. 62 పాయింట్లు తగ్గి 26,996 వద్ద ముగిసింది. ఇది దాదాపు రెండు వారాల కనిష్టంకాగా, నిఫ్టీ కూడా 8 పాయింట్లు క్షీణించి 8,086 వద్ద నిలిచింది.
సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల్లో 324 పాయింట్లు జారి 27,000 దిగువకు చేరింది. సైనిక చర్యల ద్వా రా సిరియా, ఇరాక్‌లలోని మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొనడం సెంటిమెంట్‌ను బలహీనపరచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. రూపాయి నెల రోజుల కనిష్టం 60.95ను తాకడం దీనికి జత కలిసిందని చెప్పారు.
సన్-ర్యాన్‌బాక్సీ డీలా
గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉన్నట్టుండి యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో సన్ ఫార్మా 3.5% పతనమైంది. దీంతో ర్యాన్‌బాక్సీ సైతం అదే స్థాయిలో తిరోగమించగా, డిజిన్వెస్ట్‌మెంట్ వార్తలతో పీఎస్‌యూ షేర్లు ఎన్‌హెచ్‌పీసీ 5%, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా 3.5% చొప్పున నీరసించాయి. అయితే మరోవైపు సెన్సెక్స్ దిగ్గజాలు ఎస్‌బీఐ, భెల్, హీరోమోటో 2-1.5% మధ్య పురోగమించాయి. కాగా, ప్రధాన సూచీలకు విరుద్ధంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 2,025 లాభపడితే, 1,041 మాత్రమే నష్టపోయాయి.