అగ్రరాజ్యం అమెరికాను తుపాకీ సంస్కృతి హడలెత్తిస్తోంది. జనసమ్మర్థ ప్రాంతాల్లో అగంతకులు తుపాకులతో విధ్వంసం సృష్టిస్తుండటంతో సామాన్య ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న జాత్యహంకార వ్యాఖ్యల కారణంగానే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని డెమొక్రటిక్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే కొందరు మానసిక రోగులు చేసే దాడుల్ని ప్రజలందరికీ ఆపాదించడం సరికాదని రిపబ్లిక్ పార్టీ నేతలు చెబుతున్నారు. చివరికి ఈ విష సంస్కృతి పాఠశాలలకు వ్యాపించిన నేపథ్యంలో తుపాకుల నియంత్రణకు చట్టాల్లో మార్పులు చేయాలని ప్రజలు చెబుతున్నారు.
ప్రాణాలు తీస్తున్న హ్యాండ్‌గన్స్..
అమెరికాలో అమాయక ప్రజలను కాల్చిచంపే ఘటనలు గత 30 ఏళ్లలో అధికమయ్యాయి. మదర్‌జోన్స్ అనే ఇన్వెస్టిగేటివ్ మ్యాగజీన్ కథనం ప్రకారం అమెరికాలో 1982 నుంచి ఇప్పటివరకూ ప్రజలు లక్ష్యంగా 110 దాడులు చోటుచేసుకున్నాయి. ఒక్క 2016లోనే దేశంలో తుపాకీ కాల్పుల్లో 38,658 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 22,938 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దుండగులు జరిపిన సామూహిక కాల్పుల్లో 2016లో 71 మంది తుదిశ్వాస విడిచారు. అమెరికాలో హ్యాండ్ గన్స్ కారణంగానే ఎక్కువమంది (64 శాతం) చనిపోతున్నారని ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ జాబితాలో రైఫిల్స్, షాట్‌గన్స్, ఇతర ఆయుధాలు తర్వాతి స్థానంలో నిలిచాయంది. అమెరికాలో కేవలం రూ.14,228కే ఓ హ్యాండ్‌గన్ లభ్యమవుతోంది. ఇక పెద్ద తుపాకులైతే రూ.లక్ష వరకూ ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అమెరికన్ల దగ్గర 39 కోట్ల తుపాకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తుపాకీ సంస్కృతిపై ప్యూ రీసెర్చ్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఇందులో 18–29 ఏళ్ల మధ్య వయసున్న యువతలో చాలామంది తుపాకీ హక్కులను కాపాడాలని కోరుకుంటున్నట్లు తేలింది. యువతలో ముఖ్యంగా శ్వేతజాతీయులు తుపాకీ కలగిఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు సర్వే పేర్కొంది.
అడ్డుగోడ.. ఎన్‌ఆర్‌ఏ
తుపాకుల అమ్మకాన్ని నియంత్రించాలని ప్రజలతో పాటు పలువురు డెమొక్రాట్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తుపాకుల వాడకాన్ని నియంత్రిస్తూ కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పుడే అమాయకుల ప్రాణాలను కాపాడగలమని స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ చర్యలను 55 లక్షల మంది సభ్యులున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్(ఎన్‌ఆర్‌ఏ) అనే లాబీయింగ్ బృందం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్‌ఆర్‌ఏ ఆర్థికమూలాలు ఎంతబలంగా ఉన్నాయంటే ఏకంగా రిపబ్లికన్ పార్టీ వీరికి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లో అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లకు పెద్దమొత్తంలో ఎన్నికల విరాళాలు అందిస్తూ లోబర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదన్నది నిపుణుల మాట.
అత్యధిక తుపాకులున్న టాప్–10 దేశాలు
దేశం తుపాకులు (ప్రతి 100 ఇళ్లకు)
అమెరికా 120.5
యెమెన్ 52.8
సెర్బియా 39.1
మాంటెనెగ్రో 39.1
ఉరుగ్వే 34.7
కెనడా 34.7
సైప్రస్ 34
ఫిన్‌లాండ్ 32.4
లెబనాన్ 31.9
ఐస్‌లాండ్ 31.7
విష సంస్కృతికి అడ్డుకట్టేది?
Published Mon, Aug 19 2019 7:54 AM | Last Updated on Mon, Aug 19 2019 7:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment