‘అమ్మో’రికా విద్య!
* కల్లలవుతున్న అమెరికా ఆశలు
* సంపాదించుకోవచ్చనే ఆ దేశం బాట పడుతున్న భారత విద్యార్థులు
* గ్రాడ్యుయేషన్‌లో చేరగానే.. పార్ట్‌టైమ్ ఉద్యోగాల వెతుకులాట
* దీనివల్ల స్థానిక అమెరికన్లతో గొడవలు
* అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం
* ఓటర్లకు గాలం వేసేందుకు ‘ఔట్‌సోర్సింగ్’ నియంత్రణపై ప్రభుత్వ దృష్టి
* విద్యార్థుల ప్రొఫైల్స్‌పై క్షుణ్ణంగా పరిశీలన
* డబ్బుకట్టే తాహతు, ప్రతిభ ఉంటేనే అనుమతి
* ఎలాంటి సందేహం వచ్చినా వెనక్కే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో చదువుకోవడమంటేనే ఓ స్టేటస్ సింబల్‌గా భావించే పరిస్థితి ఉంది. అక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే ఎంతో గొప్పగా కూడా చెప్పుకొంటారు. దీనికి కారణం అక్కడ ఏ ఉద్యోగం చేసుకున్నా.. అంతో ఇంతో వెనకేసుకోవడానికి అవకాశం ఉండడమే. కొన్నేళ్ల కింద అమెరికాకు వెళ్లినవారంతా బాగానే సంపాదించుకోగలిగారు కూడా. దీంతో ఆర్థికంగా వెనుకబడినా అమెరికా వెళ్లాక పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చన్న భరోసా, పెద్దగా ప్రతిభ లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి బతకొచ్చన్న ఆశతో వేలాది మంది అమెరికాకు క్యూ కడుతున్నారు.
ఇలా వెళ్లేవారి సంఖ్య పెరిగిపోతూ.. 2015లో 1.65 లక్షలు దాటింది. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడుతోంది. భారత్ వంటి విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా తమకు ఉద్యోగాలు దొరకక స్థానిక అమెరికన్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దానికితోడు ఆసియా దేశాల నుంచి వచ్చిన కొందరికి ఉగ్రవాద మూలాలు ఉండడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల సంవత్సరం కావడంతో... విదేశీ విద్యార్థుల ‘వడపోత’ మొదలైంది. ఆర్థికంగా సమర్థత లేకపోయినా, చదువులో వెనుకబడిన చరిత్ర ఉన్నా, పార్ట్‌టైం ఉద్యోగం చేస్తారనే సందేహం వచ్చినా... అమెరికా అధికారులు విమానాశ్రయాల నుంచే తిప్పి పంపేస్తున్నారు.
సీబీపీ విభాగానికి విద్యార్థుల ప్రొఫైల్..
అమెరికాలో ఏదో ఒక యూనివర్సిటీలో సీటు వచ్చింది కదా, కాన్సులేట్ వీసా కూడా ఇచ్చింది కదా ఇక ఇబ్బందేముంది అనుకుంటే పప్పులే కాలేసినట్టే. వీసా రావడంతోనే అంతా అయిపోయినట్టు కాదని విద్యార్థులు గమనించడం లేదు. అమెరికా వర్సిటీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు సంబంధించి వారు పదో తరగతి నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు దాకా చదివిన ప్రతి తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి, మొదటిసారి పాసయ్యారా లేదా, బీటెక్ అయితే నాలుగేళ్లలో ఏమైనా బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయా; జీఆర్‌ఈ, టోఫెల్ స్కోరు ఎంత వంటి పూర్తి వివరాలతో ‘కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)’ విభాగానికి ప్రొఫైల్స్ అందుతాయి.
విమానాశ్రయంలో విద్యార్థులు చెకిన్ అయిన వెంటనే వారి వివరాలన్నీ సీబీటీ అధికారి కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. విద్యార్థుల ప్రొఫైల్స్‌ను ‘ఏ, బీ, సీ, డీ, ఈ, ఓ’లుగా వర్గీకరిస్తారు. ఏ, బీ ప్రొఫైల్స్ ఉన్న విద్యార్థులను పెద్దగా విచారణతో పనిలేకుండానే దేశంలోకి అనుమతిస్తారు. సీ ప్రొఫైల్ విద్యార్థులను సీబీపీ ప్రత్యేక విభాగానికి తరలించి ప్రశ్నిస్తారు. అక్కడి నుంచి బయటపడితే అమెరికాలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. లేదంటే మళ్లీ స్వస్థలానికి విమానం ఎక్కేయడమే. ఇక ‘డీ, ఈ , ఓ’ ప్రొఫైల్‌ల విద్యార్థులకు అదృష్టం కలసి వస్తే తప్ప అంతే సంగతులు.
అమెరికాకే ఎందుకు..?
అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు వెనకేసుకోవాలనుకునే వారంతా వారి విద్యార్హతలతో నిమిత్తం లేకుండా అమెరికాకు వెళుతున్నారు. మంచి విద్య అభ్యసించాలనుకునే వారు వారి అర్హతలను బట్టి దేశాన్ని, మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది జూలై-సెప్టెంబర్ మాసాల్లో భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన మొత్తం విద్యార్థుల్లో 86 శాతం మంది అమెరికాకు వెళ్లారు.
11 శాతం మంది ఆస్ట్రేలియాకు వెళ్లారు. మిగతా వారిలో ఒక్కో శాతం చొప్పున బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్‌లకు వెళ్లారు. ఇంత పెద్ద మొత్తంలో భారత విద్యార్థులు తమ దేశానికే ఎందుకు వస్తున్నారన్నది ఇప్పుడు అమెరికా మదిలో మెదులుతున్న సందేహం. గతేడాది జూలై-సెప్టెంబర్ మధ్య 1.34 లక్షల మంది భారత విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఈ గణాంకాలే తదుపరి దశలో భారత విద్యార్థులను అమెరికా ఫిల్టర్ చేయడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
2015 జూన్-ఆగస్టు మధ్య అమెరికాకు చదువుకునేందుకు వచ్చినవారిలో ‘ఎ, బి’ ప్రొఫైల్‌లు ఉన్నవారు కేవలం 19 శాతం మందే. ‘సి’ ప్రొఫైల్‌వారు 26 శాతం మంది ఉండగా... మిగతా 55 శాతం మంది ‘డి, ఈ, ఎఫ్, ఓ’ ప్రొఫైల్‌ల విద్యార్థులని అమెరికా విద్యా, సాంస్కృతిక విభాగం అక్కడి సెనేటర్ ఒకరికి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలిసింది.
ఇప్పుడే ఎందుకు కఠినంగా..
విద్యార్థులకు వారి అర్హతలను బట్టి ప్రొఫైల్ ఉండటం కొత్త కాదు. గతంలో ‘ఓ’ ప్రొఫైల్‌తో వెళ్లిన వేలాది మంది అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. కానీ ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడం, రిపబ్లికన్ పార్టీ అచ్చంగా ఔట్‌సోర్సింగ్ తగ్గించి ఉద్యోగాల కల్పనను పెంచుతామని హామీ ఇవ్వడం నేపథ్యంలో... అధికార డెమొక్రాటిక్ పార్టీ ఇలా ‘వెనక్కి తిప్పి పంపే’ విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలోనూ ఇలాంటివి ఉన్నా ఏడాదిలో పది కేసుల కంటే తక్కువ ఉండేవి. కానీ ఈ ఏడాది భారత్, చైనాలకు చెందినవారినే దాదాపు వెయ్యి మందికిపైగా తిప్పిపంపడం గమనార్హం. దానికి తోడు ఈ రెండు దేశాల నుంచి 2015 ఫాల్ (జూలై- డిసెంబర్)కు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో చేరారు. అయితే స్థానికంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాల విషయంలో అమెరికన్లకు, విదేశాల విద్యార్థులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
కాలిఫోర్నియాలో ఇద్దరు పాకిస్తానీయులు విచక్షణారహితంగా కాల్పు లు జరపడం, ఫ్రాన్స్‌లో గొడవల నేపథ్యంలో ఆసియా నుంచి ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చేవారిని నిశి తంగా పరిశీలిస్తున్నారని అక్కడి కన్సల్టెన్సీ ఏజెన్సీలు చెబుతున్నాయి. హెచ్1బీ విషయంలోనూ ఆ వీసా పొందిన వ్యక్తి ఏదైనా అవాంఛనీయ చర్యలకు పా ల్పడితే.. స్పాన్సర్ చేసిన వారికి ఇబ్బందులు తప్పవని అమెరికా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో ఓ వర్గం వారికి హెచ్1బీ వీసాను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అమెరికా విమానాశ్రయాల నుంచే వెనక్కి వచ్చిన విద్యార్థుల్లో మెజారిటీ ఆ వర్గానికి చెందిన విద్యార్థులదే.
ఎంత మంది విద్యార్థులు వెనక్కి
డిసెంబర్ 25, 2015: ఈ ఒక్క రోజే అమెరికాలోని వివిధ విమానాశ్రయాల నుంచి 130 మందిని వెనక్కి పంపారు. వీరిలో అక్కడ మంచి యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఆర్థిక స్థోమత లేకుండా వచ్చారంటూ వారి వీసాలు రద్దు చేశారు.
డిసెంబర్ 29, 2015: కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల నుంచి 29 మంది విద్యార్థులను విమానాశ్రయాల నుంచే తిప్పిపంపారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దేశవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించింది. అక్కడ చదువుతూ సెలవుల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న వారిని గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది.
జనవరి 3, 2016: శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజిలెస్, న్యూయార్క్ విమానాశ్రయాల నుంచి 43 మంది విద్యార్థులను వెనక్కి తిప్పి పంపింది, వారి వీసాలు కూడా రద్దు చేసింది.
సీబీపీ అధికారి అడిగిన ప్రశ్నలు, ఓ విద్యార్థిని సమాధానాలివీ..
ప్ర: మీ తండ్రి పుట్టినతేదీ చెప్పగలవా?
జ: మే నెలలో అనుకుంటా సార్.. కానీ ఎప్పుడూ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోలేదు.
ప్ర: మీ తల్లి పేరు, ఇంటి పేరు చెప్పగలవా?
జ: సులోచన (పేరు మార్చాము).
ప్ర: మీ తల్లి పుట్టినరోజు?
జ: జూన్ 10వ తేదీ, కచ్చితంగా సంవత్సరం తెలియదు.
ప్ర: మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించారా?
జ: ఒకసారి ఇద్దరూ యూఎస్ వచ్చారు. బహుశా రెండేళ్ల క్రితం అనుకుంటా.. కేవలం యూఎస్ చూడటానికి వచ్చారు.
ప్ర: మీ తల్లిదండ్రులు చట్టబద్ధంగా యూఎస్ నివాస అర్హత కలిగి ఉన్నారా?
జ: లేదు సార్.
ప్ర: మీరు వివాహితులా?
జ: లేదు సార్.
ప్ర: మీకు పిల్లలు ఉన్నారా?
జ: లేదు సార్.
ప్ర: నువ్వు ఏ విమానంలో ఇక్కడకు వచ్చావు?
జ: ఎమిరేట్స్ విమానం ఏకే 225.
ప్ర: నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చావు?
జ: హైదరాబాద్, ఇండియా నుంచి..
ప్ర: ప్రస్తుతం నీ వద్ద ఎంత డబ్బు ఉంది?
జ: ఒక డాలర్, కొన్ని సెంట్లు ఉన్నాయి.
ప్ర: నీకు ఏమైనా డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయా?
జ: లేవు సార్.
ప్ర: నీ వద్ద ఇంకా ఏ రూపంలో అయినా ఏ రకమైన కరెన్సీ ఐనా (నగదు) ఉందా?
జ: సుమారు 240 రూపాయలు (3.5 డాలర్లు) ఉన్నాయి.
ప్ర: నువ్వు ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగం చేస్తున్నావా?
జ: లేదు సార్.
ప్ర: నువ్వెన్ని సంవత్సరాల్లో కాలేజీ విద్య పూర్తిచేశావు?
జ: నాలుగేళ్లలో బ్యాచిలర్ డిగ్రీ.
ప్ర: నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు?
జ: అలేఖ్య.
ప్ర: అలేఖ్యకు సమాచారం ఎలా ఇచ్చావు?
జ: ఫోన్ ద్వారా.
ప్ర: ఫోన్ ద్వారా అలేఖ్యకు సమాచారం అందించడానికి ఏ అప్లికేషన్ వినియోగించావు?
జ: వాట్సప్ మెసెంజర్.
ప్ర: అలేఖ్య ఇక్కడ ఏ కాలేజీలో చదువుకున్నారు?
జ: సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ.
ప్ర: ఇప్పుడు నువ్వు హోటల్‌కు వెడతావా.. లేదా అలేఖ్య ఇంటికి వెడుతావా?
జ: హోటల్‌కు వెళతాను.
ప్ర: మరి హోటల్ రూం బుక్ చేసుకున్నావా?
జ: లేదు.
ప్ర: హోటల్ గదికి అవసరమైన డబ్బు ఎవరు సమకూరుస్తారు?
జ: అలేఖ్య.
ప్ర: ఆమె ఎందుకు సమకూరుస్తారు?
జ: ఆమెకు మా అమ్మ పంపిస్తారు.
ప్ర: నువ్వు ఇంతకు ముందు చెప్పినట్లు నీ దగ్గర కేవలం నాలుగు డాలర్లు మాత్రమే ఉన్నాయి. నీ దగ్గర డెబిట్, క్రెడిట్ కార్డులు, ట్రావెల్ కార్డులు లేవు అర్థమవుతుందా?
జ: అవును సార్.
ప్ర: మరి నువ్వు ఇక్కడ ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుంటావ్?
జ: నా తల్లిదండ్రులు నాకు ఫండింగ్ చేస్తారు.
ప్ర: నీ తల్లిదండ్రులు నీకు డబ్బు ఎలా పంపుతారు?
జ: మా అమ్మ ఫ్రెండ్ కజిన్ ఇక్కడ ఉన్నారు. డెరైక్ట్‌గా ఆయన అకౌంట్‌కు బదిలీ చేస్తారు.
ప్ర: మీ అమ్మ ఫ్రెండ్ కజిన్ పేరు ఏమిటో తెలుసా?
జ: మహేష్.
ప్ర: మహేష్ అమెరికా పౌరుడా?
జ: నాకు తెలియదు సార్.
ప్ర: మహేష్ ఇక్కడ ఏ కాలేజీలో చదివారు?
జ: ఆయన ఏదో ఉద్యోగం చేస్తారనుకుంటా సార్.
ప్ర: నీకు బ్యాంక్ కార్డులు ఏవీ లేకుండా ఆయన నీకు డబ్బు ఎలా పంపుతారు?
జ: నేను తరగతులకు హాజరైనప్పుడు సిలికాన్ వ్యాలీ వర్సిటీ వారు బ్యాంక్ ఖాతా ఇప్పిస్తామన్నారు.
ప్ర: నువ్వు ఎప్పుడు ఎస్‌వీయూ తరగతులకు హాజరవుతావు?
జ: డిసెంబర్ 29.
ప్ర: ఇంతకు ముందు మేం అడిగినప్పుడు అలేఖ్యకు మీ అమ్మ డబ్బు పంపుతారని చెప్పావు... అర్థమైందా?
జ: అవును.
ప్ర: మీ తల్లి మీకు డెరైక్ట్‌గా మనీ ఇవ్వకుండా అలేఖ్యకు ఎందుకు పంపుతామన్నారు?
జ: నాకు ట్రావెల్ కార్డులేదు కాబట్టి అలేఖ్య ఖాతాకు పంపుతామని చెప్పారు.
ప్ర: మరి ఇప్పుడు ఇక్కడ ఆహారం, బట్టలు, వసతి, రవాణా ఖర్చులు ఎలా భరిస్తావు?
జ: మా అమ్మ నేరుగా అలేఖ్య ఖాతాకు పంపిస్తామన్నారు. నేను అలేఖ్య ట్రావెల్ కార్డు వాడుకుంటా.
ప్ర: అలాంటప్పుడు నువ్వు సొంతంగా ట్రావెల్ కార్డు ఎందుకు తీసుకోలేదు?
జ: మా అమ్మా నాన్న చెప్పారు. నీకు డెరైక్ట్‌గా 3 రోజుల్లో డబ్బు అందుతుందని.
ప్ర: మీ కాలేజీ ట్యూషన్ ఫీజు ఎంత?
జ: పది వేల డాలర్లు.
ప్ర: మొదటి సెమిస్టర్‌కు ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నావు?
జ: మూడు.
ప్ర: ఒక్కో సబ్జెక్ట్‌లో ఎన్ని యూనిట్లు ఉంటాయి?
జ: నాకు తెలియదు సార్.
ప్ర: పర్ యూనిట్‌కు ఎంత ఖర్చు అవుతుంది?
జ: పర్ సబ్జెక్ట్ 1,300 డాలర్లు అనుకుంటా.. నాకు తెలియదు సార్.
ప్ర: ప్రతి సబ్జెక్ట్‌కు 1,300 యూఎస్ డాలర్లు ఖర్చు అవుతుందా?
జ: నాకు సరిగ్గా తెలియదు సార్.
ప్ర: నువ్వు క్లాస్‌లకు ఎన్‌రోల్ అయ్యావా?
జ: లేదు.
ప్ర: ఒక సెమిస్టర్‌లో మూడు సబ్జెక్ట్‌లకు ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటున్నావు?
జ: కచ్చితంగా తెలియదు.. సుమారు 4000 డాలర్లు అనుకుంటా.
ప్ర: నీకు తెలుసా కనీసం ఒక్క క్రెడిట్‌కు ఎంత ఖర్చు అవుతుందో?
జ: తెలియదు.
ప్ర: ఒక్కో క్రెడిట్‌కు ఎంత ఖర్చవుతుందో ఎందుకు తెలుసుకోలేదు?
జ: లేదు సార్, సాధారణంగా విద్యార్థులను అడిగాను.
ప్ర: వాళ్లు నీకేమీ చెప్పారు?
జ: సబ్జెక్ట్‌కు 1,300 డాలర్లు, సెమిస్టర్‌కు 5,000 డాలర్లు అని చెప్పారు.
ప్ర: నువ్వు ట్యూషన్ ఫీజు ఎప్పుడు చెల్లించాలి?
జ: డిసెంబర్ 29.
ప్ర: డిసెంబర్ 29నాడు నువ్వు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది?
జ: 1,800 యూస్ డాలర్లు.