సాంకేతికతకు నిలువుటద్దం
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో క్రియేటివిటీకి కొదువే లేకుండా పోతోంది. నిన్న మొన్నటి తరం మాదిరి వాతావరణం, ట్రాఫిక్ వంటి విషయాలు తెలుసుకోవాలంటే రేడియోలో.. టీవీల వైపో చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల హవానే. ఇంకో అడుగు ముందుకు దూసుకుపోతే.. మనకు కావాల్సిన వివరాలను గోడకున్న అద్దంలో చూసుకోగలిగితే.. ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో కదా..! గూగుల్ సంస్థలో ఇంజనీర్ అయిన మాక్స్ బ్రాన్‌కు ఇలాంటి ఆలోచనే వచ్చింది.
తన బాత్‌రూంలో ఉన్న అద్దాన్ని ‘స్మార్ట్’గా మార్చేశారు. ఈ అద్దానికి వెనుక వైపు టీవీ స్టిక్ అనే పరికరం, ఆకుపచ్చ ఎల్‌ఈడీ, పవర్ బటన్‌ను స్విచ్ బోర్డు ద్వారా అనుసంధానం చేశాడు. ఈ టీవీ స్టిక్‌లోని సాఫ్ట్‌వేర్ అద్దం ముందు వివరాలు కనిపించేలా చేస్తుంది. అయితే ట్రాఫిక్ వివరాలు, టచ్‌స్క్రీన్, వాయిస్ ద్వారా ఆపరేట్ చేయడం వంటి అదనపు హంగులు కూడా జోడించాలని యోచిస్తున్నట్లు మాక్స్ పేర్కొన్నాడు.