ట్రంప్ టీంలో మరో భారతీయ అమెరికన్
వాషింగ్టన్: భారతీయ-అమెరికన్ వైద్యురాలు సీమా వర్మకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ యంత్రాంగంలో ఉన్నత పదవి దక్కింది. అమెరికా ఆరోగ్య విభాగంలోని ‘సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికై డ్ సర్వీసెస్’కు ఇన్‌చార్జ్‌గా ట్రంప్ ఆమెను నామినేట్ చేశారు. దీనిపై సీమ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు భారతీయ-అమెరికన్ మహిళ నిక్కీ హేలీని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ట్రంప్ నామినేట్ చేయడం తెలిసిందే. సీమ ఎస్‌వీసీ అనే జాతీయ ఆరోగ్య విధానం సలహా సంస్థను స్థాపించారు.
ప్రస్తుతం దానికి సీఈవోగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌లో సభ్యుడైన టామ్ ప్రైస్‌ను ట్రంప్ ఆరోగ్య, మానవ సేవల మంత్రిగా నామినేట్ చేశారు. ఒబామా హెల్త్ కేర్ చట్టాన్ని ప్రైస్ విమర్శించేవారు. మరోవైపు అమెరికా సీఐఏ మాజీ చీఫ్ డేవిడ్ పెట్రాస్, ట్రంప్‌ను కలిశారు. ఈయన పేరు విదేశాంగ మంత్రి పదవికి పరిశీలనలో ఉంది. మరోవైపు క్యూబాతో ఒబామా స్థాపించిన సన్నిహిత సంబంధాలను రద్దు చేస్తానని ట్రంప్ అనడంపై శ్వేతసౌధం స్పందించింది. దీనివల్ల అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంది.