
విశ్వంలో మరో గ్రహవ్యవస్థ..
వాషింగ్టన్: రెండు నక్షత్రాలు, మూడు భారీ గ్రహాలతో కూడిన సరికొత్త గ్రహ వ్యవస్థను కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ గ్రహ వ్యవస్థ ఆవిష్కరణ ద్వారా మన సౌర కుటుంబం పుట్టుక, పరిణామానికి సంబంధించి మరింత సమాచారం లభించనుందని, భవిష్యత్‌లో భూమిని పోలిన గ్రహాలను గుర్తించడంలోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మన సూర్యుడిని పోలిన నక్షత్రాలు రెండు ఉన్న గ్రహ వ్యవస్థలు విశ్వంలో చాలా ఉన్నాయి.
అయితే కొత్తగా గుర్తించిన వ్యవస్థ తాలూకూ నక్షత్రాలు కేవలం 360 ఆస్ట్రనామికల్ యూనిట్స్ (భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్) అంతరం మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన నక్షత్రాల మాదిరిగా వీటిల్లో ఇనుము, ఆక్సిజన్ వంటివి లేవు. అధిక భాగం హైడ్రోజన్, హీలియం వాయువులే ఉన్నాయి. గురుగ్రహం పరిమాణంలో సగం ఉన్న ఒకటి, ఒకటిన్నర రెట్లు ఉన్న మరో గ్రహం నక్షత్రం చుట్టూ తిరుగుతుంటే.. దాదాపు 2.5 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం రెండో నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఏర్పడిన తొలి నాళ్లలోనే ఈ నక్షత్రాలు తమ పరిసరాల్లోని చిన్న చిన్న గ్రహాలను తనలోకి లాగేసుకుని ఉంటుందని జొవానా టెస్కే చెబుతున్నారు.