'యాపిల్' రీసైక్లింగ్ లో టన్ను బంగారం!
కంచి పట్టు చీరలు పాతవైనా వాటికో విలువ ఉంటుంది. ఎందుకంటే వాటి నేతకు వినియోగించే బంగారం, వెండి, కాపర్ వంటి వస్తువులు తిరిగి పనికొస్తాయి. అలాగే యాపిల్ ఐ ఫోన్లు బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. పాతపడిపోయినా అందులో వినియోగించే వస్తువులవల్ల కూడ దానికో విలువ ఉంటుందన్నమాట. ఇటీవల యాపిల్ కంపెనీ పాత ఫోన్లు రీసైకిల్ చేసి ఏకంగా ఓ టన్ను బంగారాన్ని సేకరించిందట. అంతేకాదు దాంతోపాటు ఫోన్లో వినియోగించే అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి పదార్థాలను కూడ మిలియన్ల కొద్దీ టన్నులు సంపాదించిందట.
యాపిల్ డివైజ్ లను రీ సైకిల్ చేయడం ద్వారా ఒక సంవత్సరంలో కంపెనీ ఓ టన్నుకు పైగా బంగారాన్ని సేకరించిందట. దాంతోపాటు 10.4 మిలియన్ కిలోల స్టీల్, రెండు మిలియన్ కిలోల అల్యూమినియం, 1.4 మిలియన్ కిలోల రాగిని కూడ సేకరించింది. ఒక్క బ్రాండ్ నేమ్ కే కాదు... ఫోన్ లో వినియోగించే వస్తువులు కూడ విలువైనవి కావడంతోనే యాపిల్ ఫోన్ కు అంత క్రేజ్ ఉందన్నమాట. పూర్తిగా పారేసే బదులు అవసరం లేని, పనికిరాని వస్తువులు పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తుంటాం. అలానే యాపిల్ కంపెనీకూడ పనికిరాని ఐఫోన్లు, ఐ ప్యాడ్లు, మ్యాక్ కంప్యూటర్ల నుంచి 2015 సంవత్సరంలో సుమారు 28 మిలియన్ల యూరోలు ఖరీదైన మెటల్ ను సేకరించి సొమ్ము చేసుకుందట.
మంచి బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు త్వరగా పాడవకుండా ఉండేందుకు వాటిలో కొద్దిపాటి బంగారాన్ని కూడ వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ రీ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా పనికిరాని, పాత యాపిల్ వస్తువులను వినియోగదారులకు డబ్బు చెల్లించి కొనుగోలు చేసి కర్మాగారంలో శుద్ధి చేస్తుంది. ఇందులో లక్షల ఖరీదైన ఉక్కు, అల్యూమినియం, రాగిని సేకరించింది. తమ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీలో నాణ్యతకోసం ఖరీదైన, విలువైన వస్తువులను వాడతామని యాపిల్ కంపెనీ సంవత్సరాంతపు రీసైక్లింగ్ నివేదికలో వెల్లడించింది. అంతేకాక ఇలా రీ సైకిల్ చేయడంవల్ల ఆయా పరికరాల్లోని పునరుత్పాదక శక్తి వినియోగంతోపాటు.. ప్రకృతికి, మనుషులకు ఎటువంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపింది. తమ కంపెనీ వస్తువులద్వారా చైనా సరఫరాదారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిశుభ్రతను పాటించే అవకాశం ఉంటుందని యాపిల్ తన నివేదికలో తెలిపింది.