
ఫెయిల్యూరా.. ఫీలవ్వొద్దు..
చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది.. పరాజితులను పట్టించుకునేవారెవరు? మేం పట్టించుకుంటాం అని అంటున్నారు శామ్యూల్ వెస్ట్. శామ్యూల్ ఓ సైకాలజిస్ట్. ఒక కొత్త ఆవిష్కరణ వెనుక వందలాది విఫలయత్నాలు ఉంటాయని చెబుతున్న శామ్యూల్.. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీల కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చే నెలలో స్వీడన్‌లో ‘మ్యూజియమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ ప్రారంభమవనుంది. గత ఏడేళ్లుగా జయాపజయాలు.. వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు? అనే అంశంపై శామ్యూల్ పరిశోధన చేశారు.
‘ఏదైనా కొత్త విషయం ఆవిష్కృతమయ్యే ముందు.. దానికి సంబంధించి 80 నుంచి 90 శాతం ప్రాజెక్టులు ఫెయిలవుతుంటాయి. ప్రతి విజయం వెనుక ఓ అపజయం ఉంటుందని తెలియజెప్పడానికే ఈ మ్యూజియం. అపజయం అంటూ భయపడితే.. నువ్వు కొత్త చరిత్రను సృష్టించలేవు’ అని శామ్యూల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిలయిన 60 ఉత్పత్తులు, సేవల వివరాలను ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఈ విఫల ఉత్పత్తుల్లో కోకోకోలా తెచ్చిన కాఫీ ఫ్లేవర్డ్ డ్రింక్, టూత్‌పేస్ట్ కంపెనీ కోల్గేట్ తెచ్చిన ఆహార ఉత్పత్తులు, హార్లే డేవిడ్‌సన్ పర్ఫ్యూమ్, మొబైల్ కమ్ గేమింగ్ కోసం నోకియా తెచ్చిన ఎన్‌గేజ్ వంటివి ఉన్నాయి.