పారిస్ ఉగ్ర దాడుల కేసులో కీలక నిందితుడు సలాహ్ అబ్దేస్లామ్‌ను శుక్రవారం బ్రస్సెల్స్ సమీపంలోని మోలెన్‌బీక్‌లో అరెస్టుచేశారు. 26 ఏళ్ల అబ్దేస్లామ్ కోసం ఐదు నెలలుగా వేట కొనసాగుతోంది
బ్రస్సెల్స్: పారిస్ ఉగ్ర దాడుల కేసులో కీలక నిందితుడు సలాహ్ అబ్దేస్లామ్‌ను శుక్రవారం బ్రస్సెల్స్ సమీపంలోని మోలెన్‌బీక్‌లో అరెస్టుచేశారు. 26 ఏళ్ల అబ్దేస్లామ్ కోసం ఐదు నెలలుగా వేట కొనసాగుతోంది. ఒక అపార్ట్‌మెంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో సలాహ్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి.
అతనికి బ్రస్సెల్స్‌లోని సెయింట్ పియరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పోలీసు అధికారులు ఉగ్రవాద హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేశారు. అబ్దేస్లామ్‌ను ఫ్రాన్స్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని అతని న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. వీలై నంత త్వరలో సలాహ్‌ను ఫ్రాన్స్ తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పారు. శనివారం ఆయన కేబినెట్ మంత్రులు, అధికారులతో భేటీ అయి విచారణలో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. గత ఏడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన దాడుల్లో 130 మంది చనిపోయారు.