paris terror attack
-
అదేరోజు బ్రిటన్, జర్మనీలోనూ దాడులకు కుట్ర!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 132 మందిని బలిగొన్న ప్యారిస్ ఉగ్రదాడులు గుర్తుండే ఉంటాయి కదూ. సరిగ్గా అదేరోజు బ్రిటన్, జర్మనీ దేశాలలో కూడా దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కుట్ర పన్నిందట. ఆ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ నెలలో ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు కొన్ని నెలల ముందు ఈ దాడులకు పాల్పడిన అబ్దెల్హమీద్ అబౌద్, మహ్మద్ అబ్రిని ఇద్దరూ బర్మింగ్‌హామ్, లండన్ నగరాల్లో ఉన్నారట. అంతకుముందు యూకేలో కూడా కొంతమంది జీహాదీలను నియమించుకుని, వాళ్లతో దాడులు చేయించడానికి వీలుగా అక్కడకు ఐదుసార్లు వెళ్లారట. ఆయా నగరాలకు బాంబులను తరలించడం కష్టమని భావించి, అందుకోసం యూకేలోనే నమ్మకస్తుడైన బాంబు తయారీ నిపుణుడిని ఉంచుకుంటే మంచిదని కూడా ఐఎస్ఐఎస్ భావించినట్లు భద్రతా రంగ నిపుణుడు ఒకరు చెప్పారు. ఎవరైనా యూరప్‌లో సులువుగా తిరిగేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్ అవలంబిస్తున్న విధానం కారణంగా భద్రతాపరమైన ముప్పు ఎక్కువవుతోందని అమెరికా నిఘా విభాగం అధినేత జేమ్స్ క్లాపర్ హెచ్చరించారు. యూకే, జర్మనీ, ఇటలీ దేశాలలో కూడా ఉగ్రవాద దాడులు చేసి భారీ ఎత్తున మారణహోమానికి పాల్పడాలని ఐఎస్ జీహాదీలు కుట్రపన్నుతున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం వలసలు ఎక్కువగా ఉండటంతో ఆ ముసుగులో కొందరు జీహాదీలను యూరోపియన్ దేశాల్లోకి పంపేందుకు ఐఎస్ కుట్ర పన్నిందట. బ్రసెల్స్, ప్యారిస్ నగరాల్లో ఉగ్రవాద దాడులు చేసిన తరహా స్లీపర్ సెల్స్ యూకే, జర్మనీ, ఇటలీలలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. -
పారిస్ దాడుల కేసులో కీలక నిందితుడి అరెస్టు
బ్రస్సెల్స్: పారిస్ ఉగ్ర దాడుల కేసులో కీలక నిందితుడు సలాహ్ అబ్దేస్లామ్ను శుక్రవారం బ్రస్సెల్స్ సమీపంలోని మోలెన్బీక్లో అరెస్టుచేశారు. 26 ఏళ్ల అబ్దేస్లామ్ కోసం ఐదు నెలలుగా వేట కొనసాగుతోంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో సలాహ్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతనికి బ్రస్సెల్స్‌లోని సెయింట్ పియరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పోలీసు అధికారులు ఉగ్రవాద హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేశారు. అబ్దేస్లామ్ను ఫ్రాన్స్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని అతని న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. వీలై నంత త్వరలో సలాహ్‌ను ఫ్రాన్స్ తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పారు. శనివారం ఆయన కేబినెట్ మంత్రులు, అధికారులతో భేటీ అయి విచారణలో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. గత ఏడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన దాడుల్లో 130 మంది చనిపోయారు. -
ఉగ్రదాడులతో దేవీశ్రీ షో వాయిదా..?
ఇటీవల కాలంలో సినీతారలు సామాజిక అంశాలపై కూడా భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ఉగ్రవాదుల దాడులు లాంటివి జరిగినప్పుడు అక్కడి బాధితులకు సాయం అదించటం. సాయం చేయాల్సిందిగా అభిమానులకు పిలుపునివ్వటం లాంటివి చేస్తుంటారు. అంతేకాదు పెను విషాదాలు సంభవించినప్పుడు తమ వినోద కార్యక్రమాలను వాయిదా వేస్తూ తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇదేబాటలో తాజాగా స్వర సంచలనం దేవీశ్రీ ప్రసాద్ తన మ్యూజికల్ నైట్‌ను వాయిదా వేశాడు. ఈరోజు (శనివారం) సాయంత్రం హైదరాబాద్, నిజాంపేట్ శ్రీ చైతన్య కాలేజీలో దేవీశ్రీ ప్రసాద్ మ్యూజికల్ షో నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో పాటు దేవీ సంగీతం అందించిన కుమారి 21ఎఫ్ సినిమా ప్లాటినం డిస్క్ వేడుకను కూడా నిర్వహించాలని భావించారు. అయితే పారిస్‌లో జరిగిన మారణకాండతో ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. ప్రపంచం అంతా బాధలో ఉన్న సమయంలో తాము మాత్రం మ్యూజికల్ నైట్‌లో ఎంజాయ్ చేయటం సరికాదని భావించిన చిత్ర యూనిట్ తమ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే ఈ వాయిదాపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా, దేవీ మాత్రం వాయిదా వేసే ఆలోచనలోనే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
బందీలుగా తీసుకెళ్లి.. బాంబులు పేల్చి..
-
వందమందిని బందీలుగా తీసుకెళ్లి.. బాంబులు పేల్చి..
అక్కడో సంగీత కచేరీ జరుగుతోంది. ఆ హాల్లో అప్పటికి ఎక్కువ మంది లేరు. కానీ ఉగ్రవాదులు మాత్రం వేర్వేరు చోట్ల తాము పట్టుకున్న బందీలలో సుమారు వందమందిని అక్కడికి తరలించారు. ఒకేసారి బాంబులు పేల్చి ఆ హాల్లో ఉన్నవాళ్లను అందరినీ చంపేశారు. ఫ్రాన్స్ చరిత్రలోనే ఇంతవరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఎక్కువ మంది ఇక్కడే మరణించారు. ద బటాక్లాన్ అనే అత్యంత ప్రముఖ వేదిక వద్ద 'అమెరికన్ బ్యాండ్ ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్' కచేరీ జరుగుతోంది. అక్కడే వీళ్లందరినీ చంపేసినట్లు ఫ్రెంచి న్యూస్ సర్వీస్ తెలిపింది. అత్యంత ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ ఉగ్రవాద దాడులలో స్పోర్ట్స్ స్టేడియం వద్ద, మరో ఐదు ప్రధాన ప్రాంతాల వద్ద కాల్పులు, పేలుళ్లకు పాల్పడి మరికొన్ని డజన్ల మందిని హతమార్చారు. దాదాపు ఏడాది క్రితం చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండ కంటే ఇది మరింత తీవ్రస్థాయిలో ఉంది. తాను ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగానే ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ అన్నారు. అక్కడి నుంచి ఆయనను తరలించగానే అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించి, సరిహద్దులను మూసేస్తున్నట్లు ప్రకటించారు.