అదేరోజు బ్రిటన్, జర్మనీలోనూ దాడులకు కుట్ర!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 132 మందిని బలిగొన్న ప్యారిస్ ఉగ్రదాడులు గుర్తుండే ఉంటాయి కదూ. సరిగ్గా అదేరోజు బ్రిటన్, జర్మనీ దేశాలలో కూడా దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కుట్ర పన్నిందట. ఆ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ నెలలో ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు కొన్ని నెలల ముందు ఈ దాడులకు పాల్పడిన అబ్దెల్‌హమీద్ అబౌద్, మహ్మద్ అబ్రిని ఇద్దరూ బర్మింగ్‌హామ్, లండన్ నగరాల్లో ఉన్నారట. అంతకుముందు యూకేలో కూడా కొంతమంది జీహాదీలను నియమించుకుని, వాళ్లతో దాడులు చేయించడానికి వీలుగా అక్కడకు ఐదుసార్లు వెళ్లారట. ఆయా నగరాలకు బాంబులను తరలించడం కష్టమని భావించి, అందుకోసం యూకేలోనే నమ్మకస్తుడైన బాంబు తయారీ నిపుణుడిని ఉంచుకుంటే మంచిదని కూడా ఐఎస్ఐఎస్ భావించినట్లు భద్రతా రంగ నిపుణుడు ఒకరు చెప్పారు.
ఎవరైనా యూరప్‌లో సులువుగా తిరిగేందుకు వీలుగా యూరోపియన్ యూనియన్ అవలంబిస్తున్న విధానం కారణంగా భద్రతాపరమైన ముప్పు ఎక్కువవుతోందని అమెరికా నిఘా విభాగం అధినేత జేమ్స్ క్లాపర్ హెచ్చరించారు. యూకే, జర్మనీ, ఇటలీ దేశాలలో కూడా ఉగ్రవాద దాడులు చేసి భారీ ఎత్తున మారణహోమానికి పాల్పడాలని ఐఎస్ జీహాదీలు కుట్రపన్నుతున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం వలసలు ఎక్కువగా ఉండటంతో ఆ ముసుగులో కొందరు జీహాదీలను యూరోపియన్ దేశాల్లోకి పంపేందుకు ఐఎస్ కుట్ర పన్నిందట. బ్రసెల్స్, ప్యారిస్ నగరాల్లో ఉగ్రవాద దాడులు చేసిన తరహా స్లీపర్ సెల్స్ యూకే, జర్మనీ, ఇటలీలలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.