
రంజాన్ తర్వాత పేలుళ్లకు స్కెచ్!
► ఉగ్రవాదుల తొలి ప్లాన్ ఇదే
► ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ ఆదేశాలతో మార్పు
► రంజాన్‌కు ముందు.. శని, ఆదివారాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ముష్కరులు
► ఎన్‌ఐఏ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రంజాన్ తర్వాత మారణహోమం సృష్టించేందుకు ఉగ్రమూకలు ప్లాన్ వేశాయా? కానీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ(ఐసిస్) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వ్యూహం మార్చుకొని రంజాన్‌కు ముందే పేలుళ్లకు సిద్ధమయ్యారా? అవుననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) వర్గాలు! ముష్కరులు వాస్తవానికి రంజాన్ తర్వాత నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నారని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ అల్ అద్నానీ సూచన మేరకు పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చారు.
హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేసిన ఐదుగురు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు శనివారం దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. ఒక్కొక్కరిగా, బృందాలుగా కూర్చోబెట్టి వారిని విచారించారు. ముఖ్యంగా కుట్రలో కీలకంగా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ, హబీబ్ మహ్మద్ అలియాస్ యూసఫ్ గుల్షన్‌లను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఐసిస్ ఉగ్రవాది అబ్ మహ్మద్ అల్ అద్నానీ పాత్ర వెలుగు చూసింది. ఇతడి ప్రోద్బలంతోనే పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చినట్లు ఎన్‌ఐఏ అధికారులకు ముష్కరులు వెల్లడించారు.
వాస్తవానికి రంజాన్ తర్వాత పేలుళ్లు జరపాలని భావించగా.. అబ్ మహ్మద్ మాత్రం తీవ్రంగా వాదించి వారం రోజులు ముందుగా అది కూడా శని, ఆదివారాల్లో జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. అందుకు అతడు 30 నిమిషాల నిడివి గల ఆడియోను ‘ఆన్‌లైన్’ ద్వారా పంపినట్లు అధికారులు గుర్తించారు. పేలుళ్లకు మొదట్లో విముఖత చూపిన వారు కూడా ఆ ఆడియో విన్న తర్వాత ఆసక్తి కనబర్చారు. దీంతో ఆ ఆడియోలో మహ్మద్ ప్రస్తావించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఆర్మర్ కనుసన్నల్లో రిక్రూట్‌మెంట్లు
సిరియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాది షఫీ ఆర్మర్ కనుసన్నల్లో పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్లు జరిగినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షఫీ ఆర్మర్ ఐసిస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు ఐసిస్‌కు అనుబంధంగా అన్సార్ ఉల్ తవ్హిద్ పి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)ని ఏర్పాటు చేసి యువతను ఆకర్షిస్తున్నాడు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు పంపుతూ వారిని ప్రోత్సహిస్తున్నాడు. వీడియో కాలింగ్ ద్వారా బాంబుల తయారీ విధానంపై కూడా తర్ఫీదు ఇస్తున్నాడు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కొందరిని ఐసిస్ దిశగా దృష్టి మళ్లించినట్లు ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నాయి.
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేరిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు. బుధవారం పాతబస్తీలో పట్టుబడిన వారి నుంచి దాదాపు 40 సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్‌లతో పాటు పెద్ద మొత్తంలో రసాయన పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైన సమాచారాన్ని వెలికితీయాలని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులకు సూచించారు. అలాగే కోడింగ్ విధానంలో జరిగిన సంభాషణలపైనా అధ్యయనం చేయాలని ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోరారు.
ఇబ్రహీం సౌదీ టూర్‌పై ఆరా
మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ 2 నెలల కిత్రం సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఆ పర్యటనలో ఎవరెవరితో సమావేశమయ్యాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. మారుపేర్లతో సౌదీకి వచ్చిన షఫీ ఆర్మర్.. ఇబ్రహీంతో చర్చించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఇటీవల ఎవరైనా హైదరాబాద్ వ చ్చారా? కశ్మీర్‌లోని వేర్పాటు వాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అని ముష్కరులను ప్రశ్నించారు.
నేడు మహారాష్ట్రకు ఉగ్రవాదులు!
తమ కస్టడీలో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం మహారాష్ట్రకు తీసుకువెళ్లాలని ఎన్‌ఐఏ అధికారులు యోచిస్తున్నారు. ఇబ్రహీం యాజ్దానీ మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అతడికి సహకరించిన వారితో పాటు అక్కడున్న పరిచయాలపై ఆరా తీయనున్నారు. అక్కడ్నుంచి ఇబ్రహీం రాజస్థాన్ లో పర్యటించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు.