
భారత్‌పై విషం చిమ్మిన చైనా
భారత్‌పై మరోసారి చైనా విషం చిమ్మింది. ఓ అసత్య కథనాన్ని అక్కడి మీడియా వండివార్చింది.
బీజింగ్: భారత్‌పై మరోసారి చైనా విషం చిమ్మింది. అసత్య కథనాన్ని అక్కడి మీడియా వండివార్చింది. భారత్ అక్రమంగా పరిపాలిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని, తీవ్ర కష్టాలుపడుతున్నారని ఇష్టరీతినా ఓ చైనాకు చెందిన అధికారిక పత్రిక రాసింది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తిరిగి చైనాకు వచ్చేయాలని అనుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొంది.
దలైలామాకు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఇస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలోనే అక్కడి పేపర్లో ఇలాంటి కథనం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘చట్ట విరుద్ధంగా భారత్ పరిపాలిస్తున్న దక్షిణ టిబెట్(అరుణాచల్ ప్రదేశ్‌లో భాగం. దీనిని చైనా తమదిగా చెప్పుకుంటోంది) ప్రాంతంలోని ప్రజలంతా తీవ్ర కష్టాలు, దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఒకరకమైన వివక్షను చవిచూస్తూ వారు ఇండియాకు తిరిగొచ్చేయాలని అనుకుంటున్నారు’ అంటూ చైనా డెయిలీ రాసుకొచ్చింది.