ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి | Attack on indian in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి

Published Tue, Mar 21 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

Attack on indian in Australia

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలోనూ జాత్యహంకారం పడగవిప్పుతోంది. అమెరికాలో భారతీయులపై జాత్యహంకార దాడులు మరువకముందే తాజాగా ఆస్ట్రేలియాలోనూ అదే తరహాలో దాడి జరగడం కలవరపెడుతోంది. ఆదివారం మెల్‌బోర్న్‌లోని ఓ చర్చిలో భారత సంతతికి చెందిన క్రైస్తవ మతగురువు టామీ కలాథూర్‌ మాథ్యూ(48)పై దుండగుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. ‘నువ్వు భారత్‌కు చెందిన హిందువువి లేదా ముస్లింవి. ప్రార్థన చేసేందుకు నీవు అనర్హుడివి’ అని పేర్కొంటూ అతడు కత్తితో మాథ్యూ గొంతులో పొడిచాడు. ‘చర్చి వెనుకవైపు పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. అనంతరం మాథ్యూ నా వైపు రావడం గమనించాను. తనపై దాడి జరిగిందని మాథ్యూ చెప్పారు’ అని చర్చికి వచ్చిన మెలీనా తెలిపారు. మాథ్యూ ప్రస్తుతం నార్తన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫాక్నర్‌కు చెందిన 72 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ దాడిని వ్యక్తిగతమైనదిగానే భావిస్తున్నామని, అతడు ఇతరులకు అపాయం కలిగిస్తాడని సూచించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని డిటెక్టివ్‌ సీనియర్‌ కానిస్టేబుల్‌ రియాన్నన్‌ నోర్టాన్‌ విలేకరులకు తెలిపారు. ఈ ఘటన భయంకరమైనదని మెల్‌బోర్న్‌కు చెందిన మత బోధకుడు షేన్‌ హేలీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ.. ఆస్పత్రిలో మాథ్యూను భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు కలిశారని, అలాగే పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement