ఆస్ట్రేలియాలో ఇండియన్ల జనాభా పెరుగుతోంది. ఆ దేశంలో సెటిల్ అయ్యే భారతీయుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. భారతీయులహోటళ్లు, పార్కులు, రెస్టారెంట్ బిజినెస్‌లు కూడా అక్కడ ఎక్కువగా విస్తరిస్తున్నాయి. ఇంతలా భారతీయులు ఆస్ట్రేలియా వైపు మొగ్గుచూపడానికి కారణమేంటి?
ఆస్త్రేలియాలో ప్రస్తుతమున్న వలస దేశాల్లో భారతీయులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియాలో పలు ఇండియన్ రెస్టారెంట్‌లు అందుబాటులోకి వచ్చాయి. రోహిత్ సింగ్ ఆస్ట్రేలియాలోని మార్నింగ్టన్ పెనిన్సులాలో నివసిస్తున్న రెండవ తరం భారతీయుడు. రోహిత్ సింగ్ కుటుంబం 1990లో ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. అవనీ వైన్స్ పేరుతో గత పదేళ్లుగా రెస్టారెంట్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారు. చేపలు, దాల్ మఖానీ సహా పలు భారతీయ వంటకాలను పరిచయం చేస్తున్నారు.
ఇంతకుముందు ఆస్ట్రేలియాలో భారతీయులు చాలా తక్కువగా కనిపించేవారని, ఒక వీధిలో ఒకరి కంటే ఎక్కువమంది ఉండేవారు కాదని ప్రముఖ జర్నలిస్ట్ ఆర్తి బెటిగేరి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.1960లో వీరి కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వచ్చింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు చాలా మారిపోయాయని, విద్య, ఉద్యోగం సహా సొంత వ్యాపారాల్లో ఇండియన్స్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. రాజకీయాల్లో కూడా భారతీయులు తమ మార్క్ చూపిస్తున్నారని పేర్కొంది.
ఇటీవల ఎన్నికైన న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వంలో నలుగురు భారతీయ సంతతికి చెందిన వారే కావడం విశేషం. వీరిలో ఆస్ట్రేలియన్ ట్రెజరర్‌గా తొలిసారిగా భారతీయ మూలాలకు చెందిన డేనియల్ ముఖీ ఎన్నికయ్యారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సిడ్నీలో ప్రసంగిస్తూ మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా లాంటి టీవీ షోలు, క్రికెట్, సినిమాలు ఈ రెండు దేశాల ప్రజలను దగ్గర చేశాయని అన్నారు.
30ఏళ్లలో అదే తొలిసారి
ఈ ర్యాలీకి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. 2014 నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని నిపుణులు అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత ప్రధాని ఆస్ట్రేలియాకు వెళ్లడం అదే తొలిసారి. మేలో జరిగిన ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రాకపోకలు ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలకు సులభతరం చేసేందుకు వలస ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇద్దరు ప్రధానులూ తెలిపారు.
క్వాడ్ గ్రూపులో భాగస్వామ్యం
మార్చిలో, ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తొలిసారిగా భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు ప్రధానులు రక్షణ, భద్రత, ఆర్థిక సహకాంర, విద్య, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై చర్చించారు.వరుస సమావేశాలతో ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలను మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచాయి అని గ్లోబల్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ గ్రూప్ అయిన CUTS ఇంటర్నేషనల్‌లో పనిచేస్తున్న ప్రదీప్ ఎస్ మెహతా చెప్పారు.ఈ రకమైన భాగస్వామ్యం ఇరుదేశాలకూ లాభదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించే లక్ష్యంతో నలుగురు సభ్యుల క్వాడ్ గ్రూపులో భాగమైన ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.
గణనీయంగా పెరిగిన వలసలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధం ఈనాటిది కాదు. ఒకప్పుడు ఈ రెండు దేశాలు గోండ్వానా అనే మహాఖండంలో భాగంగా ఉండేవి. 1800కాలం నుంచి భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లడం ప్రారంభమైందని నిపుణులు అంటున్నారు.1900 నుంచి ఈ వలసలు విస్తృతంగా పెరిగాయని,1973లో 'వైట్ ఆస్ట్రేలియా పాలసీ'ని రద్దుచేసిన తరువాత ఆస్ట్రేలియాలోకి వలసలు గణనీయంగా పెరిగాయి. అప్పటికీ కేవలం టెక్ వర్కర్లు, వైద్యులు, నర్సులు,విద్యావేత్తలు వంటి నైపుణ్యం కలిగిన వలసదారులు మాత్రమే ఆస్ట్రేలియాలోకి ఆహ్వానించేవారు.. అది కూడా తక్కువ సంఖ్యలోనే అని రీసెర్చర్ జయంత్ బాపట్ తెలిపారు. అయితే 2006 తర్వాత పరిస్థితి మారింది.
నిరసనలతో ఉద్రిక్తత
జాన్ హోవార్డ్ నేతృత్వంలోని ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు పెద్దపీట వేసింది. వారి చదువులకే కాకుండా శాశ్వర నివాసం పొందడాన్ని సులభతరం చేస్తూ పలు చర్యలను ప్రేవేశపెట్టింది. అయితే గతంలో అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2000నాటి చివర్లో సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో భారతీయ విద్యార్థులపై జరిగిన హింసాత్మక దాడులు వార్తల్లో నిలిచింది. ఈ దాడులకు నిరసనగా అక్కడి భారతీయులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే చర్యలు కూడా చేపట్టింది. అయినా సరే ఇప్పటికీ అక్కడక్కడే అలాంటి హింసాత్మక ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి.
ఆస్ట్రేలియాలో మన సంస్కృతి, సంప్రదాయాలు
ఆసియా, దక్షిణాసియా దేశాల నుంచి వలస వచ్చినవారు బహుళ సాంస్కృతికతను తీసుకువచ్చారని, దానివల్ల ఆ దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందిందని కొందరు మద్దతుదారులు అంటారు. భారత్ నుంచి అక్కడికి వెళ్లిన వారు కూడా మన సంస్కృతి, సంప్రదాయాల గురించి చెబుతూ మరింత అవగాహన కల్పిస్తున్నారు. సిడ్నీలో పెరిగిన 24 ఏళ్ల దివ్య సక్సేనా కథక్, భరతనాట్యం వంటి నృత్యాలను ఆస్ట్రేలియాలో మరింత మెయిన్ స్ట్రీమ్‌గా మార్చాలని కోరుకుంటోంది. స్టీరియోటైప్‌లను బద్దలు కొట్టడానికి తనలాంటి భారతీయ-ఆస్ట్రేలియన్ క్రియేటివ్‌ల యొక్క అభివృద్ధి చెందుతున్న సంఘం సిడ్నీలో ఉందని ఆమె చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment