వాయవ్య చైనాలోని షాంక్సి రాష్ట్రంలో ఓ వైద్యుడు అప్పుడే పుట్టిన శిశువును అమ్మేయగా, పోలీసులు ఆ శిశువును రక్షించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. సెంట్రల్ హెనన్ రాష్ట్రంలోని ఆంయాంగ్ నగరంలో శిశువును స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుర్తింపును నిర్ధారించుకోడానికి ఇంకా డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ మగ శిశువును ఫుపింగ్ కౌంటీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడు జూలై 17వ తేదీన దాదాపు రెండు లక్షల రూపాయలకు అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. ఝాంగ్ అనే ఈ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
బిడ్డకు పుట్టుకతోనే ఏదో వ్యాధి వచ్చిందని, అందువల్ల చికిత్స చేయడానికి తమవద్దే ఉంచుకుంటామంటూ వైద్యుడు చెప్పి, బిడ్డను ఎత్తుకుపోయాడు. ఆ విషయం తల్లికి తర్వాత తెలిసి, పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆస్పత్రి అధినేతతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు. ఇదే ఆస్పత్రిలో మరో ఐదు సంఘటనలు కూడా ఇలాంటివి జరిగాయని, వాటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.