![Balakot Terror Attack Pakistan Residents Thought Earthquake Attack - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/26/iaf.jpeg.webp?itok=ocOntjfa)
ఇస్లామాబాద్ : భారత వైమానిక దళం మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నేలమట్టం చేసింది. ఈ దాడిలో వైమానిక దళం ఆరు బాంబులను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. వీటి గురించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారంటే.. ‘తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించింది. భూకంపం వచ్చిందా.. లేక పిడుగు పడిందా అనిపించింది. ఇక మేం నిద్రపోలేదు. 5-10 నిమిషాల తర్వాత అర్థమయ్యింది అవి బాంబులు పేలిన శబ్దాల’ని అంటూ చెప్పుకొచ్చారు.
జాబా గ్రామానికి చెందిన మరో రైతు మాట్లాడుతూ ‘దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో మా బంధువులు ఉన్నారు. ఈ దాడుల్లో మా బంధువు ఒకరు గాయపడ్డారు. చుట్టూ పక్కల ఉన్న ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మొత్తం 5 బాంబుపేలుళ్లను, విమానాల చప్పుళ్లను విన్నాం. ఉదయాన్నే కొన్ని బాంబు శకలాలను, నాలుగైదు ఇళ్లు నేలమట్టం అవ్వడం చూశాము’ అని తెలిపాడు. కానీ పాకిస్తాన్ మాత్రం దాడులు జరిగాయనే విషయాన్ని అంగీకరించడం లేదు. భారత్ దాడులు చేయడానికి ప్రయత్నించిందని.. కానీ పాక్ యద్ధ విమనాలను చూసి భయపడి దాడి ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. (సర్జికల్ స్ట్రైక్ - 2 జరిగిందిలా..!)
Comments
Please login to add a commentAdd a comment