బ్యూటీక్వీన్‌ను కాల్చి చంపేశాడు!
కొన్నేళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లిన ఫిలిప్పినా బ్యూటీక్వీన్ గ్లాడిస్ టోర్డిల్‌ను ఆమె మాజీ భర్త యూలాలియో టార్డిల్ కాల్చి చంపేశాడు. ఈ ఘటన అమెరికాలోని ప్రిన్స్ జార్జ్ కౌంటీ స్కూల్లో జరిగింది. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లున్నారు. ఇద్దరూ హైస్కూళ్లలో చదువుతున్నారు. ప్రస్తుతం తల్లిని కోల్పోవడంతో వారిని ఫోస్టర్‌కేర్‌లో ఉంచారు. పికిటెనపోస్ ఇంటర్నేషనల్ సంస్థలోని మిడ్‌వెస్ట్ ఈస్ట్‌కోస్ట్ విభాగంలో గ్లాడిస్ చురుగ్గా పనిచేస్తున్నారు. ఒకవైపు తండ్రి వదిలేయడం.. మరోవైపు తల్లి చనిపోవడంతో ఇద్దరు అమ్మాయిలు ఇటు ఆర్థికంగాను, అటు మానసికంగాను తీవ్రంగా దెబ్బతిన్నారు. చిట్టచివరి క్షణాల్లో గ్లాడిస్‌ను కాపాడేందుకు అటువైపు వెళ్లే వ్యక్తి ప్రయత్నించినా.. ఉపయోగం లేకపోయింది. స్కూలు పార్కింగ్ ప్రదేశంలో ఆమెపై కాల్పులు జరిగాయి.
గతంలో బ్యూటీక్వీన్ కిరీటాన్ని గెలుచుకున్న గ్లాడిస్.. ప్రస్తుతం ప్రిన్స్ జార్జ్ కౌంటీ పబ్లిక్ స్కూల్లో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఫోనిక్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. గ్లాడిస్‌తో పాటు మరో ఇద్దరిని కూడా కాల్చిచంపిన ఆమె మాజీ భర్త యూలాలియో టార్డిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.