బెడ్రూమ్ నుంచే లక్షలు కొల్లగొడుతోంది!
డబ్బు సంపాదించడమే ఆమె లక్ష్యం కాదు. కానీ లక్షలకు లక్షలు వచ్చిపడుతున్నాయి. స్టార్ డమ్ కూడా కోరుకున్నదికాదు. కానీ, హయ్యస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్ గా ఫేమస్ అయిపోయింది. ఇంకోమాట చెప్పాలంటే జీవితం పట్ల ఆమెకున్న సానుకూల దృక్ఫథమే ఇప్పుడున్న స్థాయికి తీసుకెళ్లింది. సంప్రదాయాలను పక్కనపెడుతూ, సంపాదనా మార్గాలు కొత్తపుంతలు తొక్కుతోన్న 'ఈ-కాలానికి' తగ్గట్టు బెడ్ రూమ్ నుంచే నెలకు 20 లక్షలకుపైగా సంపాదిస్తోంది.. 20 ఏళ్ల బెథాని మోటా.
బెథాని మోటా హయ్యస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్లలో ఒకరు. చోటామోటా టిప్ప్ నుంచి బడా నేత బరాక్ ఒబామాను ఇంటర్వ్యూ వరకు ఆమె రూపొందించిన వీడియోలన్నీ సంచలనాలే. ఒక అంశాన్ని ఎన్నుకుని, అందమైన గొంతుకతో మాట్లాడుతూ, అద్భుతమైన తన రూపలావణ్యాంతో వీడియోల్లో కనిపించే బెథాని తక్కువ సమయంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. జస్ట్ బెడ్ రూమ్ లో కూర్చొనే Macbarbie07 పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించింది. 2009లో ప్రారంభించిన చానెల్ ద్వారా ఔట్ ఫిట్ ఐడియాలు, మేకప్ టిప్స్, హెయిర్ ట్యూషన్స్, రెసిపీస్, డూ ఇట్ యువర్సెల్ఫ్ ఐడియాలు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, మోటివేషన్ క్లాసులు.. ఒక్కటేంటి, ఎన్నిరకాల ప్రయోగాలు చెయ్యొచ్చో అన్నీ చేసేసింది. ఆమె చానెల్ ను 98 లక్షల మంది వీక్షకులు రెగ్యులర్ గా చూస్తారట.
ప్రఖ్యాత ఫైనాన్స్ సంస్థ 'బిజినెస్ ఇన్ సైడర్' అంచనా ప్రకారం బెథాని మోటా నెలకు 40 వేల డాలర్లు (మన కరెన్సీలో పాతిక లక్షలకు పైమాటే) సంపాదిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ రిటెయిలర్ కంపెనీ ఫరెవర్ 21తోపాటు జేసీ పెన్నీ స్టోర్స్ తో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న బెథాని.. ఆయా సంస్థల ఉత్పత్తులను తన వీడియోల్లో ప్రమోట్ చేస్తుందన్నమాట. ఇంటర్నెట్ లో తనను ఆదరిస్తోన్న అభిమానులను ప్రత్యక్షంగా కలిసి నాలుగు మంచిమాటలు చెప్పేందుకు 'మోటా-వేటర్' (మోటివేటర్ కు ప్రత్యామ్నాయంగా ఆమె క్రియేట్ చేసిన పదం) పేరుతో టూర్లు నిర్వహిస్తుంది. యూట్యూబ్ లో బెథాని మోటా సృష్టిస్తోన్న సంచలనాలకు గుర్తింపుగా 2015లో టీన్ ఛాయిస్ అవార్డు ఆమెను వరించింది.
పట్టుమని పదేళ్లైనా నిండకముందే ఇంటర్నెట్ ఫ్రీక్ గా మారిన బెథాని.. 12 ఏళ్లకే తన మొట్టమొదటి వీడియోను యూట్యుబ్ లో పెట్టింది. 'మై స్పేస్ పేరు'తో ఆమె చేసిన వీడియో చూసి ఫ్రెండ్స్ గేలి చేశారట. ఇక బంధువులైతే ' నీకింకా యూట్యూబ్ లోకి వెళ్లే వయసురాలేదు' అని నిరాశపరిచారట. ఆ వయసులోనే విమర్శలనే హార్డిల్స్ ను దాటుకుంటూ తనకేదైతే ఇష్టమో అదే చేస్తోంది బెథాని. 'ఫలానా పనో లేక అలాంటి ఉద్యోగమో చేయాలని లేదిప్పుడు. ఇంటర్నెట్ క్రియేటివిటీకి రెడ్ కార్పెట్ లాంటిది. నచ్చిన పని చేయండి. ధనలక్షి మీ దగ్గరికి నడిచొచ్చేరోజు తప్పక వస్తుంది. పాజిటివ్ యాట్యిట్యూడ్ ను మాత్రం విడిచిపెట్టొద్దు' అని యువతకు 'మోటావేట్' మంత్రం చెబుతుంది బెథాని మోటా.