కొలంబో: శ్రీలంకలో వరుస పేలుళ్లపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లు లక్ష్యం చేసుకుని జరిగిన బాంబు పేలుళ్లను కొలంబో బిషప్ డిలోరాజ్ ఖండించారు. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భావోద్వేగంతో కూడిన ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను కోల్పోయినవారికి, గాయపడినవారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తమలాంటి దేశంలో ఈ ఘటన జరగడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ అనంతరం శ్రీలంక ప్రజల శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విధ్వంసక ఘటనలకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment