చిన్న రక్త పరీక్షతో కేన్సర్ల గుట్టు రట్టు!
వాషింగ్టన్: కేన్సర్ వ్యాధి ముదిరి ప్రాణాపాయ స్థితికి చేరేదాకా.. దానిని గుర్తించడం కష్టమే. అలాంటిది కేవలం ఒక చిన్న రక్త పరీక్షతో ఊపిరితిత్తులు, ప్రొస్టేట్ కేన్సర్‌లను తొలిదశలో గుర్తించే విధానాన్ని అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న 55 మంది, ప్రొస్టేట్ కేన్సర్ ఉన్న 40 మందిపై పరిశోధన చేశారు. కేన్సర్ బారినపడినవారి రక్తంలోని సీరం రహిత కొవ్వు ఆమ్లాలు, జీవక్రియకు తోడ్పడే రసాయనాల శాతంలో తేడాలు ఉన్నట్లుగా గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన జింబో ల్యూ చెప్పారు. ఈ ఆమ్లాలు, రసాయనాల శాతాన్ని రక్త పరీక్షతో సులువుగా గమనించవచ్చని.. తద్వారా కేన్సర్‌ను గుర్తించవచ్చని పేర్కొన్నారు.
6
మీరు పారేసే ఆహారం.. 80 కోట్ల మంది ఆకలి తీరుస్తుంది
రోమ్: ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఆహారాన్ని వృథా చేసే సంస్కృతి నానాటికీ ఎక్కువవుతోందని, ఈ విధానానికి ఇప్పటికైనా స్వస్థి పలకాలని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌ఓ) ఉద్ఘాటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో మూడు వంతులు వృథా అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. వృథాగా పారేస్తున్న ఆహారంతో సుమారు 84.2 కోట్ల మంది పేదల ఆకలి తీర్చవచ్చని పేర్కొంది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవంలో యూఎన్ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) ప్రతినిధి రాబర్ట్ వాన్ ఆటెర్ డిజ్క్ పేర్కొన్నారు. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం, స్థూల కాయం విజృంభిస్తున్నాయని తెలిపారు.