
అమ్మాయికి అబ్బాయికి పదమూడే..
పదమూడేళ్ల వయసున్న బాలుడు, బాలికకు పెళ్లి చేయడంపై వివాదం రాజుకుంది.
పదమూడేళ్ల వయసున్న బాలుడు, బాలికకు పెళ్లి చేయడంపై వివాదం రాజుకుంది. ఇందులో మరో ట్విస్టేంటంటే అమ్మాయి పెళ్లి అయ్యే నాటికే గర్భవతి కూడా. అమ్మాయి, అబ్బాయి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లి చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చైనాలోని డింగ్‌యాన్ కౌంటి అనే గ్రామంలో నెల రోజుల క్రితం ఈ పెళ్లి జరిగింది.
వీరికి తక్కువ వయసు ఉండటం వల్ల వివాహాన్ని రిజిస్టర్ చేయడం కూడా కుదరలేదని స్ధానిక అధికారి ఒకరు తెలిపారు. అందుకే పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి వివాహం జరిపించినట్లు చెప్పారు. వాస్తవానికి చైనాలో చట్టబద్ధంగా వివాహ వయసు అబ్బాయికి 22, అమ్మాయికి 20. అయితే, గ్రామీణ చైనాలో బాల్య వివాహాలు సర్వసాధారణం.
పెళ్లి విషయంలో ప్రభుత్వ నిబంధనలను వారు పూచికపుల్లలా తీసిపారేస్తారు. చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ కూడా బాల్యవివాహాలకు కారణమని కొందరు అంటున్నారు. పాలసీ కారణంగా ఎక్కువ మంది అబ్బాయికే జన్మనివ్వాలని భావించడంతో.. అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో చిన్నవయసులోనే గ్రామీణ చైనాలో పెళ్లిళ్లు చేస్తుంటారు.