
చైనాతో యాపిల్ సీఈవో రహస‍్య ఒప్పందంపై కార్పొరేట్ రంగంలో జోరుగా చర్చ సాగుతోంది.
Apple CEO Tim Cook Secretly Signed 275 Billion Deal With China: గ్లోబల్ మార్కెట్‌లో అమెరికా-చైనా మధ్య జరిగే ట్రేడ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఈ నాటిది కాదు. ‘దేశభక్తి’ నినాదంతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని ప్రయత్నించే అమెరికా.. దానికి కఠిన ఆంక్షలతో సమానమైన కౌంటర్ ఇచ్చే చైనా.. వెరసి గ్లోబల్ ట్రేడింగ్‌లో దేశాలు పరస్పరం ఒకదానినొకటి దశాబ్దాలుగా కిందటి లాగేసుకుంటాయి. ఈ తరుణంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ చేసిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది.
అమెరికన్ కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్.. చైనాతో 275 బిలియన్ డాలర్ల రహస్య ఒప్పందం చేసుకున్నాడు. యాపిల్ డివైజ్‌లు, సేవలపై చైనా ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా ఉండేందుకు.. చైనాను శాంతిపజేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ ‘ది ఇన్ఫర్మేషన్’ ఓ కథనం ప్రచురించింది.
2016లో చైనా పర్యటన సందర్భంగా టిమ్ కుక్ ఈ భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని, నియంత్రణ చర్యలు తప్పించుకునేందుకే అధికారులతో లాబీయింగ్‌లో భాగంగా ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు యాపిల్ డివైజ్‌లలో చైనాకు చెందిన కాంపోనెంట్స్‌ను ఎక్కువగా వాడడం, చైనీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందాలు, చైనా యూనివర్సిటీలకు చెందిన సాంకేతికతనే వాడడం, చైనా కంపెనీల్లోనే నేరుగా పెట్టుబడుల.. ఇలాంటి షరతులకు సైతం టిమ్ కుక్ ఒప్పుకున్నట్లు ఆ కథనం తెలిపింది.
రిటైల్ స్టోర్స్, రీసెర్చ్ & డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసమే ఆ ఒప్పందం చేసుకున్నట్లు ది ఇన్ఫర్మేషన్ కథనం పేర్కొంది. ఈ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉండగా.. అధ్యక్షుడు జిన్ పింగ్ తెచ్చిన చట్టాల పరిధిలోకి చేరడం వల్ల వచ్చే ఏడాది చివరినాటిదాకా పొడిగించినట్లయ్యింది.
దేశభక్తి విమర్శ
అమెరికా కంపెనీలన్నీ ఒకదారి అయితే.. యాపిల్ మరోదారిలో పయనించడం విమర్శలకు తావిచ్చింది. ఊహించని ఈ స్నేహ హస్తం మీద చర్చలూ జరుగుతున్నాయి. సాధారణంగా అమెరికన్ కంపెనీలు ఒప్పందాలకు దూరంగా ఉంటూనే.. చైనా మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. దేశభక్తిని హైలెట్ చేస్తూ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. ఇక ట్రంప్ హయాంలో అయితే యాపిల్ సైతం అమితమైన దేశభక్తిని ప్రదర్శించింది కూడా!. ఈ తరుణంలోనే చైనా విధిస్తున్న కఠిన వాణిజ్య-వ్యాపార నిబంధనలను అంగీకరించలేక.. ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అమెరికా కంపెనీలు. అయితే యాపిల్ మాత్రం ఇందుకు భిన్నంగా రహస్య ఒప్పందం చేసుకుందన్న కథనం కలకలం సృష్టిస్తోంది. ఇక చైనాలో విదేశీ కంపెనీల వ్యాపారం మొత్తంలో యాపిల్ వాటానే(83 శాతం) ఎక్కువగా ఉంటోంది. అందుకే యాపిల్ ఇలా రహస్య ఒప్పందాలకు సిద్ధపడిందన్న వాదనా వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆంక్షలకు, కఠిన నిబంధనలకు-చట్టాలకు భయపడి.. చైనాకు దాసోహమైన టిమ్ కుక్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కథనంపై యాపిల్ నుంచి స్పందన రావాల్సి ఉంది.