లైవ్లో మాట్లాడుతుండగా.. రేడియో జాకీ హత్య
రియోడిజనీరో: బ్రెజిల్లో దారుణ ఘటన జరిగింది. ఓ రేడియో జాకీని దుండగులు అతి కిరాతకంగా కల్చి చంపారు. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్లోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.
వివరాల్లోకి వెళ్తే.. జోవా వెల్డసిర్ డీ బోర్బా(52) బ్రెజిల్ రేడియో డిఫ్యుసొరా ఏఎమ్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు 10 ఏళ్లుగా నేర సంఘటనలను రిపోర్ట్ చేసే కార్యక్రమాలు నిర్వహించిన బోర్బా ఇటీవలే సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బోర్బాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో బోర్బా పాటు ఉన్న సహోద్యోగి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సిగరెట్ తాగడానికి తాను బయటకు వెళ్లి వచ్చే సరికి దుండగులు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడిచారు. క్రైమ్ ఘటనలను రిపోర్ట్ చేసే సమయంలోనే బోర్బాకు నేరస్తుల నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బ్రెజిల్లో ఎనిమిది మంది రేడియో వ్యాఖ్యాతలు హత్యకు గురయ్యారని బ్రెజిల్ అసోసియేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ప్రజెంటర్స్ వెల్లడించింది.