బ్రిటన్ లో ఎమర్జెన్సీ బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని ఆ దేశ కొత్త ఆర్థిక మంత్రి ఫిలిప్ హమ్మండ్ తోసిపుచ్చారు. ప్రస్తుతం అత్యవసర బడ్జెట్ ప్రవేశపెట్టే అవసరమేమి లేదని, ఆర్థిక సంవత్సరం చివరిలోనే బడ్జెట్ ను సమర్పిస్తామని కొత్త మంత్రి స్పష్టంచేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు వెల్లడైన ప్రజాభిప్రాయ తీర్పుతో, ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఎమర్జెన్సీ బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సినవసరం వస్తుందని బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి ఒస్బోర్న్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కానీ ఈ నిర్ణయాన్ని కొత్త ఆర్థికమంత్రి వెంటనే తిరస్కరించారు.
బ్రిటన్ లో అత్యవసర బడ్జెట్ ఏమీ ప్రవేశపెట్టడం లేదని వివిధ మీడియా సంస్థలకు హమ్మండ్ తెలిపారు. ఎప్పుడు ప్రవేశపెట్టే మాదిరిగానే బడ్జెట్ ను ప్రవేశపెడతామని, బ్రెగ్జిట్ పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తామని స్కై న్యూస్ కు ఆయన వెల్లడించారు. అయితే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుదని ఐటీవీ చానెల్ కు చెప్పారు. బ్రెగ్జిట్ వల్ల ఏర్పడిన ఆర్థిక పతనాన్ని నిర్మూలించడానికి వడ్డీరేట్లలో 0.50 కోత ఉంటుందని తెలుస్తోంది. రెఫరెండం ఫలితాలతో డాలర్ తో పోలిస్తే ఫౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. ఈ బలహీనమైన ఫౌండ్ విలువ ఇటు ఎగుమతిదారులకు అనుకూలంగా మారగా.. దిగుమతులు మరింత భారంగా మారింది. ద్రవ్యోల్బణం ఎగబాకడానికి దోహదం చేసింది.
బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో కామెరాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆయన వారసురాలిగా థెరిసా మే ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఒస్బోర్న్ ఆర్థికమంత్రిగా వైదొలగడంతో 2014 నుంచి కెమెరాన్ ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా ఉన్న హమ్మండ్ ఆయన స్థానంలో కొత్త ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటిష్ కాఠిన్యానికి ఒస్బోర్న్ గత ఆరు సంవత్సరాలుగా రూపశిల్పిగా ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కెమెరాన్ కు క్లోజ్ ఫ్రెండ్. యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ కొనసాగాలని వీరిద్దరూ తీవ్రంగా ప్రచారం నిర్వహించారు. కానీ ఊహించని మాదిరిగా బ్రిటన్ ప్రజాభిప్రాయ తీర్పు వెలువడింది.
ఎమర్జెన్సీ బడ్జెట్ ను తోసిపుచ్చిన బ్రిటన్ మంత్రి
Published Thu, Jul 14 2016 3:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement
Advertisement