బాధితురాలు కరోలిన్, బ్రిటన్ మంత్రి మార్క్ గార్నియర్.
లండన్ : ఘనతవహించిన మంత్రివర్యులొకరు.. మహిళా సెక్రటరీ చేత సెక్స్ టాయ్స్ కొనిపించడమేకాక లైంగికంగా వేధించిన వ్యవహారం ప్రస్తుతం బ్రిటన్‌ను కుదిపేస్తోంది. థెరిసా మే కేబినెట్‌లో అత్యంత కీలకమైన ‘బ్రెగ్జిట్’ మంత్రిగా కొనసాగుతున్న మార్క్ గార్నియర్‌పై ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు బ్రిటిష్ కేబినెట్ కార్యాలయం ప్రకటించింది. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ‘మీ టూ(metoo) క్యాంపెయిన్‌లో భాగంగా బాధితురాలు కరోలిన్ ఎడ్మండ్‌సన్ తన చేదు అనుభవాన్ని వెల్లడించారు.
భార్య కోసం వైబ్రేటర్ తెమ్మన్నాడు : ‘‘మార్క్ గార్నియర్ తొలిసారి బ్రిటన్ పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికైనప్పుడు(2010లో) ఆయనకు సెక్రటరీగా పనిచేశాను. ఓసారి నన్నొక షాప్ దగ్గరికి తీసుకెళ్లిన ఆయన.. చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి ‘లోపలికెళ్లి రెండు వైబ్రేటర్లు కొనుక్కురా, ఒకటి మా ఆవిడకి, రెండోది నా నియోజకవర్గంలోని ఆఫీసులో ఉండే మహిళకి’’ అంటూ ఆదేశించారు. చేసేదేమీలేక లోపలికెళ్లి ఆ సెక్స్‌టాయ్స్‌ను కొనుకొచ్చి ఆయనకిచ్చేశాను. మరో సందర్భంలో.. ఓ మద్యం పార్టీలో నలుగురిముందూ నన్ను లైంగికదుర్భాషలాడారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతని వద్ద ఉద్యోగం మానేశాను’’ అని కరోలిన్ వెల్లడించారు.
అవును, తెమ్మన్నాను కానీ.. : తన మాజీ సెక్రటరీ కరోలిన్ చేసిన ఆరోపణలపై మంత్రి గార్నియర్ స్పందించారు. ఆమె చెప్పిన విషయం అబద్ధంకాదంటూనే తాను సచ్ఛీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘‘అవును. షాప్ నుంచి సెక్స్‌టాయ్స్ తెమ్మని ఆమెను(మహిళా సెక్రటరీని) పురమాయించిన మాట నిజమే. అయితే ఆమె పట్ల నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నిజానికి నేనప్పుడు ఆమెతో ప్రమాదరహితంగానే ప్రవర్తించా’’ అని వివరణ ఇచ్చారు.
ప్రధాని స్పందన.. విచారణ వేగవంతం : ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోలిన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన కేబినెట్ మంత్రే కావడంతో ప్రధాని థెరిసా మే తక్షణం స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని బ్రిటన్ కేబినెట్ కార్యాలయాన్ని ఆదేశించారు. నాటి ఘటనలో మార్క్ గార్నియర్.. పార్లమెంట్ సభ్యుడిగా పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయితే గనుక పదవిని కోల్పోయే అవకాశం ఉంది.
#metoo : ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా మిలానో ‘మీ టూ’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆమె ఇచ్చిన పిలుపును అందుకుని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది స్పందిస్తున్నారు. దాదాపు అన్ని దేశాల మహిళలు #metoo అంటూ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షడు జార్జ్‌బుష్(సీనియర్), ఇప్పటి బ్రిటన్ మంత్రి మార్క్ గార్నియర్, పలు దేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖుల వికృతపర్వాలు వెలుగులోకివచ్చాయి. దాదాపు అన్ని ఘటనల్లోనూ పురుష పుంగవులు.. తమకెలాంటి దురుద్దేశాలు లేవని చెప్పుకుంటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment