ఈ బుడ్డోడు ట్రంప్కు వీర ఫ్యాన్!
కాలిఫోర్నియా: డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. అంతకన్నా ఎక్కువగా ఈ ఎన్నికల్లో ఆయన నినాదం 'మేక్ అమెరికా ప్రైడ్ ఎగైన్' ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా నానుతోంది. టీషర్ట్లు, క్యాప్లు ఇలా అవకాశం ఉన్న ప్రతిచోటా ఈ నినాదం వెలుగుతోంది. అయితే ట్రంప్ నినాదంతో ఉన్న క్యాప్ను ధరించొద్దని ఓ ఎలిమెంటరీ స్కూల్ జారీ చేసిన ఆజ్ఙను ఓ తొమ్మిదేళ్ల బాలుడు లెక్కచేయకుండా వార్తల్లో నిలిచాడు.
కాలిఫోర్నియాలోని గిన్స్బర్గ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న లొగాన్ అట్రీకి ట్రంప్ అంటే అభిమానం. దీంతో గత వారం స్థానికంగా ట్రంప్ ర్యాలీ సందర్భంగా స్కూల్కు డుమ్మా కొట్టి మరీ వెళ్లాడు. అక్కడే ర్యాలీలో ట్రంప్ నినాదంతో ఉన్న ఓ క్యాప్ను కొనుగోలు చేశాడు. అయితే.. ఆ క్యాప్ పెట్టుకొని స్కూల్కు వెళ్లిన అట్రీకి స్కూల్ సిబ్బంది అడ్డు చెప్పారు. ఇలాంటి చర్యలతో మిగతా విద్యార్థులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి అతనికి సర్థి చెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆ క్యాప్ను తీసేయడానికి మాత్రం అట్రీ ఒప్పుకోలేదు. చివరికి స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చి అట్రీకి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది.
అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలంటే తనకు ఇష్టమని అట్రీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపాడు. పెద్దయ్యాక పొలిటికల్ లీడర్ను అవుతానంటూ చెబుతున్న ఈ కుర్రాడు.. తల్లిదండ్రులు వేరే క్యాప్ కొనిచ్చిన పెట్టుకోవటం లేదట. స్కూల్ యాజమాన్యం ఏమనుకుంటుంది.. తోటి విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనే విషయాలతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు.