
ఊహించని ప్రమాదం
ఇండియానా: ప్రియురాలి మృతదేహంతో కారులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి రెండు రోజుల తర్వాత బయటపడిన ఘటన అమెరికాలోని ఇండియానా చోటు చేసుకుంది. కెవిన్ బెల్(39) తన ప్రియురాలు నిక్కీ రీడ్(37)తో కలిసి ఈ నెల 17న ఫోర్డ్ కారులో పెన్సిల్వేనియాకు బయలుదేరాడు. జెన్నింగ్స్ కౌంటీలో కారు చెట్టును ఢీకొనడంతో వీరు ప్రమాదం బారిన పడ్డారు. నిక్కీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ సీటులో కూర్చున్న కెవిన్ ఎడమ కాలికి తీవ్రంగా గాయమైంది. దీంతో కదలేక కారులోనే ఉండిపోయాడు.
ప్రియురాలి మృతదేహం పక్కనే కారులో రెండురోజుల పాటు గడిపాడు. చివరికి అందులోంచి బయటపడి రోడ్డుపైకి చేరుకుని ఓ ప్రయాణికుడి సహాయంతో మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి చేరాడు. అసలేం జరిగిందనేది ఇంకా తెలియలేదని ఇండియానా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ప్రమాదం జరిగిన గ్రామీణ ప్రాంతం ప్రధాన రహదారికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇండియానాకు తిరిగి వస్తున్నామని శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులకు కెవిన్, నిక్కీ తెలిపారని, తర్వాత వారి ఫోన్లు చేయలేదని వెల్లడించారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, ఆచూకీ తెలిస్తే చెప్పాలని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. చివరకు వీరు ప్రమాదం బారిన పడ్డారని తెలుసుకుని షాక్ కు గురయ్యారు. నిక్కీ రీడ్ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.